కీలకమైన నాలుగో టెస్టుకు రెడీ.. రహానేపై వేటు తప్పదా..?
India Look To Fight Back After Big Defeat In Leeds.ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటికే
By తోట వంశీ కుమార్ Published on 2 Sep 2021 2:14 AM GMTఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. కీలకమైన నాలుగో టెస్టుకు ఇరు జట్లు సన్నద్దం అయ్యాయి. ఓవల్ మైదానంలో నేటి నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకుపోవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలగా ఉన్నాయి. అయితే.. మూడో టెస్టులో ఘోర ఓటమి తరువాత భారత్ ఎలా పుంజుకుంటుంది అన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు కోహ్లీ, పుజారా, రహానే బ్యాటింగ్ ఫామ్ ఆందోలన కలిగిస్తోంది.
రహానేను తొలగిస్తారా..?
మూడో టెస్టులో పుజారా ఫామ్ అందుకున్నాడు. అయితే..రహానే ఏ మాత్రం ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం లేదు. గత అయిదు ఇన్నింగ్స్‌ల్లో 19 సగటుతో అతడు 95 పరుగులే చేశాడు. దీంతో రహానే ను తప్పించి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారిల్లో ఒకరిని ఆడించినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం అందరి దృష్టి టీమ్ మేనేజ్‌మెంట్‌పైనే ఉంది. రహానే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. ఒక వేళ రహానే పై వేటు వేయాలని జట్టు మేనేజ్‌మెంట్ బావిస్తే.. అతడి స్థానంలో ఆప్‌స్పిన్ వేయగల విహారికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ కోహ్లీ సైతం భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. అతడు సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. ఓపెనర్లు బాగానే ఆడుతున్నా.. కోహ్లీ, పుజరా, రహానేలు భారీ స్కోర్లు చేయడం లేదు. వీరి వైఫల్యం జట్టును వేదిస్తోంది. ఎంతో సీనియర్లు అయినా.. ఈ ముగ్గురు రాణిస్తే బ్యాటింగ్‌లో భారత్‌కు తిరుగు ఉండదు.
ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. మరీ ఈ మ్యాచ్‌లోనైనా అశ్విన్‌ను తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నలుగురు పేసర్ల ఫార్ములాకే కోహ్లీ ఎక్కువగా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఇషాంత్ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగల శార్దూల్ ఠాకూర్‌ను కూడా తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. బంతితో పెద్దగా రాణించని జడేజా స్థానంలో అశ్విన్‌ను తీసుకుంటారా అన్నది వేచిచూడాల్సిందే. ఇదే మైదానంలో కొద్ది రోజుల క్రితం కౌంటీ మ్యాచ్ ఆడిన అశ్విన్ 7 వికెట్ల తో చెలరేగడం అతని అవకాశాలను పెంచుతోంది.
రూట్ ఒక్కడే..
ప్రస్తుత సిరీస్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. శతకాల మీద శతకాలు చేస్తున్నాడు. మిగతా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లను అడ్డుకుంటున్నప్పటికి రూట్ కొరకరాని కొయ్యగా మారుతున్నాడు. రూట్‌ను ఎంత త్వరగా పెవిలియన్ చేరిస్తే భారత్ మ్యాచ్‌పై అంత పట్టులభిస్తుందనడంలో సందేహాం లేదు. వ్యక్తిగత కారణాలతో జోస్ బట్లర్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో బెయిర్‌స్టో వికెట్ కీపింగ్ చేయనున్నాడు. ఒలీ పోప్ బ్యాట్స్‌మన్ స్థానాన్ని భర్తీ చేస్తాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా మొయిన్ అలీ కీలకం కానున్నాడు.