గర్జించిన భారత బౌలర్లు.. కుప్పకూలిన ఇంగ్లాండ్.. 249 పరుగుల ఆధిక్యంలో కోహ్లీ సేన
India lead England by 249 runs at Stumps.చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టుబిగించింది.కుప్పకూలిన ఇంగ్లాండ్.. 249 పరుగుల ఆధిక్యంలో కోహ్లీ సేన
By తోట వంశీ కుమార్ Published on 14 Feb 2021 4:55 PM ISTచెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ను 134 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా.. రెండో రోజు ఆట ముగిసే సమాయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 249 పరుగుల లీడ్‌లో ఉంది. రోహిత్ శర్మ 25 పరుగులతోనూ, పుజారా 7 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.
ఇంగ్లాండ్ 134 ఆలౌట్..
స్పిన్‌కు అనుకూలించే చెపాక్ పిచ్‌పై భారత్ బౌలర్లు రెచ్చిపోయారు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఇషాంత్ శర్మ షాకిచ్చాడు. ఖాతా తెరవక ముందే ఓపెనర్ రోరీ బర్న్స్(0) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్.. మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(16), డాన్ లారెన్స్(9) ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 39/4తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం బెన్ స్టోక్స్(9)ను అశ్విన్ బౌల్డ్ చేయగా.. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ఓలి పోప్(22)ను రిషభ్ పంత్ సూపర్ క్యాచ్ సాయంతో సిరాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. కొద్దిసేపటికే మొయిల్ అలీ(6) రహానే సూపర్ క్యాచ్‌లో అక్షర్ ఔట్ చేశాడు. కొద్దిసేపటికే ఓలి స్టోన్‌ను అశ్విన్ పెవిలియన్‌కు చేర్చడంతో ఇంగ్లండ్ 106/8తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
బ్రేక్ అనంతరం 10 ఓవర్ల వ్యవధిలోనే ఇంగ్లండ్ ఆలౌటైంది. రిషభ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌తో జాక్ లీచ్(5)ను ఇషాంత్ పెవిలియన్ చేర్చగా.. స్టువర్ట్ బ్రాడ్(0)ను అశ్విన్ బౌల్డ్ చేయడంతో 59.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 134 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో బెన్‌ఫోక్స్ (42 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్ అక్షర్ పటేల్ , ఇషాంత్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
29 పరుగులు.. 4 వికెట్లు..
అంతకముందు.. ఓవర్ నైట్ స్కోర్ 300/6 తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 29 పరుగులు మాత్రమే జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. రిషబ్‌పంత్ (58, 77 బంతుల్లో 7 పోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకంతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ 4, ఒలి స్టోన్ 3, జాక్ లీచ్ 2, జో రూట్ ఒక వికెట్ పడగొట్టారు.