'దేశం గర్విస్తుంది'.. నీరజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కెరీర్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును తాకాడు

By Medi Samrat
Published on : 17 May 2025 2:33 PM IST

దేశం గర్విస్తుంది.. నీరజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కెరీర్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును తాకాడు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ అతనిని ప్రశంసించారు. దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ 90 మీటర్ల మార్కును తాకాడు.. కానీ రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్‌ను కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మాట్లాడుతూ.. అతని విజయానికి.. అతని అవిరామ అంకితభావం, క్రమశిక్షణకు దేశం గ‌ర్విస్తుంద‌న్నారు.

ప్రధాని మోదీ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో 'భారతదేశం సంతోషిస్తుంది.. గర్వంగా ఉంది' అని రాశారు. 'గొప్ప విజయం! దోహా డైమండ్ లీగ్ 2025లో నీరజ్ చోప్రా 90 మీటర్ల మార్కును దాటి వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు అభినందనలు. ఇది అతని అలసిపోని అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచికి ఫలితం అని కొనియాడారు.

శుక్రవారం జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ జావెలిన్‌ను 90.23 మీటర్లు విసిరి ఎట్టకేలకు 90 మీటర్ల పరిమితిని అధిగమించాడు. అయితే రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ తన చివరి ప్రయత్నంలో జావెలిన్ 91 మీటర్లు విసిరి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

27 ఏళ్ల నీరజ్ త‌న‌ మూడవ ప్రయత్నంలో తన జావెలిన్‌ను 90.23 మీటర్లకు విసిరాడు.. అయితే వెబర్ తన చివరి ప్రయత్నంలో 91.06 మీటర్లు విసిరాడు. నీరజ్ ప్రస్తుత కోచ్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాన్ జెలెజ్నీ 90 మీటర్ల కంటే ఎక్కువ విసిరిన జావెలిన్ త్రోయర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు.

టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ చోప్రా 90 మీటర్లు దాటిన వారిలో ప్రపంచంలో 25వ ఆటగాడిగా.. ఆసియాలో మూడో ఆటగాడిగా నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ (92.97 మీటర్లు), చైనీస్ తైపీకి చెందిన చావో సన్ చెంగ్ (91.36) మాత్రమే ఆసియా నుంచి 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరిన ఇద్దరు ఆటగాళ్లు.

Next Story