ముగిసిన రెండో రోజు ఆట.. పట్టుబిగించిన భారత్.. కష్టాల్లో శ్రీలంక
India in firm control as Srilanka struggle at 108/4 at stumps.శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమ్
By తోట వంశీ కుమార్ Published on 5 March 2022 7:36 PM ISTశ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా పట్టు బిగిస్తోంది. తొలుత రవీంద్ర జడేజా (175 నాటౌట్; 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో ) భారీ శతకంతో రాణించడంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఇంకా 466 పరుగుల వెనుకంజలో లంక ఉంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం నిశాంక(26), చరిత్ అసలంక(1) క్రీజులో ఉన్నారు.
చివరి సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆ జట్టు ఓపెనర్లు కరుణ రత్నె(28), లహిరు తిరిమన్నె(17) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అశ్విన్ విడగొట్టాడు. లాహిరు తిరిమన్నేను ఎల్బీగా అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరికాసేపటికే మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నేను జడేజా పెవిలియన్ చేర్చాడు. దీంతో 59 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో పడింది.
ఈ దశలో సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్(22), నిశాంకతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కుదురుకుంటున్న ఈ జోడిని బుమ్రా విడగొట్టాడు. మాథ్యూస్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. తరువాత క్రీజులోకి వచ్చిన డిసిల్వా(1)ను అశ్విన్ వికెట్ల ఔట్ చేయడంతో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. చరిత్ అసలంక, నిశాంక మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.