రాహుల్ శ‌త‌కం.. పంత్ విధ్వంసం.. రెండో వ‌న్డేలో టీమ్ఇండియా భారీ స్కోర్

India finish on 336/6.పుణె వేదిక‌గా జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్లు స‌త్తా చాటారు. కేఎల్ రాహుల్ శ‌త‌కం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2021 11:52 AM GMT
India finish on 336/6

పుణె వేదిక‌గా జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్లు స‌త్తా చాటారు. కేఎల్ రాహుల్ శ‌త‌కం(108; 114 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్స‌ర్లు)తో స‌త్తాచాట‌గా రిష‌బ్ పంత్ (77; 40 బంతుల్లో 3 పోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 336 ప‌రుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ( 66; 79 బంతుల్లో 3 పోర్లు, 1 సిక్స్‌) అర్థ‌శ‌త‌కంతో రాణించగా.. చివ‌ర్లో హార్థిక్ పాండ్య‌(35; 16 బంతుల్లో 1పోర్, 3 సిక్స‌ర్లు) ధాటిగా బ్యాటింగ్ చేయ‌డంతో ఇంగ్లాండ్ ముందు 337 ప‌రుగుల భారీ విజ‌య‌ల‌క్ష్యాన్ని ఉంచింది భార‌త్‌.

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. తొలి వ‌న్డేలో 98 ప‌రుగులు చేసిన శిఖ‌ర్ రెండో వ‌న్డేలో కేవ‌లం 4 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. దీంతో భార‌త్ 9 ప‌రుగుల వ‌ద్దే తొలి వికెట్ కోల్పోయింది. ఈ ద‌శ‌లో వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీతో క‌లిసి రోహిత్ ఇన్నింగ్స్ న‌డిపించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నాడు. వీరిద్ద‌రు మంచి బంతుల‌ను గౌర‌విస్తూ చెత్త బంతుల‌ను బౌండ‌రీకి త‌ర‌లించారు. 25 బంతుల్లో 5 పోర్ల‌తో 25 ప‌రుగులు చేసి ట‌చ్‌లోకి వ‌చ్చిన రోహిత్‌ను సామ్ క‌ర‌ణ్ బోల్తా కొట్టించాడు. దీంతో 37 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది భార‌త్‌. ఈ త‌రుణంలో కెప్టెన్ కోహ్లికి రాహుల్ జ‌త‌క‌లిశాడు. వీరిద్ద‌రు ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్ర‌మంలో కోహ్లీ 62 బంతుల్లో, రాహుల్ 66 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నారు.

ప్ర‌మాద‌కంగా మారుతున్న ఈ జోడిని ఆదిల్ ర‌షీద్ విడ‌దీశాడు. విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. దీంతో 158 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ నాలుగో వికెట్ కోల్పోయింది. విరాట్- రాహుల్ జోడి నాలుగో వికెట్‌కు 121 ప‌రుగులు జోడించారు. విరాట్ అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన పంత్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి ఆడాడు. బంతి ప‌డ‌డ‌మే ఆల‌స్యం బౌండ‌రీకి త‌ర‌లించాలి అన్న క‌సితో బ్యాటింగ్ చేశాడు. దీంతో స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టింది. మ‌రో వైపు అర్థ‌శ‌త‌కం త‌రువాత రాహుల్ కూడా జోరందుకున్నాడు. ఈ క్ర‌మంలో పంత్ 28 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకోగా.. రాహుల్ 108 బంతుల్లో వ‌న్డేల్లో ఐదో శ‌త‌కాన్ని సాధించాడు. అనంత‌రం ధాటిగా ఆడే క్ర‌మంలో ఇద్ద‌రూ పెవిలియ‌న్‌కు చేర‌గా.. చివ‌ర్లో హార్థిక్ పాండ్య త‌న‌దైన విధ్వ‌సంతో భార‌త్‌కు భారీ స్కోర్ అందించాడు.


Next Story