ఫామ్ అందుకున్న ధావన్, రాహుల్.. దంచికొట్టిన కృనాల్.. టీమ్ఇండియా 317/5
India finish on 317/5.పుణె వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది.
By తోట వంశీ కుమార్ Published on 23 March 2021 5:55 PM ISTపుణె వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ శిఖర్ దావన్( 98;106 బంతుల్లో 11పోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ(56; 60బంతుల్లో 6పోర్లు), కేఎల్ రాహుల్(62; 43 బంతుల్లో 4పోర్లు, 4సిక్సర్లు), కృనాల్ పాండ్య (58; 31 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్సర్లు) లు అర్థశతకాలతో రాణించడంతో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 318 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
శుభారంభం..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(28; 42 బంతుల్లో 4పోర్లు), శిఖర్ ధావన్‌లు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బెన్ స్టోక్స్ విడగొట్టాడు. వికెట్లకు దూరంగా వెలుతున్న బంతిని రోహిత్ ఆడడంతో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ధావన్ ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను సునాయాసనంగా ఎదుర్కొన్నారు.
మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో శిఖర్ 70 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తిచేసుకోగా.. కోహ్లీ 52 బంతుల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. అనంతరం మార్క్‌వుడ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన కోహ్లీ బౌండరీ మోయిన్ అలీ చేతికి చిక్కాడు. దీంతో 169 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత్. వీరిద్దరు రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 6 పరుగుల మాత్రమే చేసి మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు ధావన్ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. చాలా కాలం తరువాత ఫామ్ అందుకున్న అతడు చక్కని షాట్లతో అలరించాడు. అయితే.. శతకానికి 2 పరుగుల దూరంలో స్టోక్స్ బౌలింగ్‌లో పుల్‌షాట్ ఆడబోయి మోర్గాన్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 197 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆదుకుంటాడని అనుకున్న హార్థిక్ పాండ్యా ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 205 పరుగు వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది.
దంచి కొట్టిన కృనాల్ పాండ్య..
హార్థిక్ ఔట్ అయిన అనంతరం వచ్చిన కృనాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. అరంగ్రేట మ్యాచ్‌లోనే చితక్కొట్టాడు. కేవలం 26 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. ఓ వైపు కృనాల్ బాదుతుండగా.. మరోవైపు ఫామ్ లేమితో సతమతమతమవుతున్న రాహుల్ కూడా ఫామ్ అందుకున్నాడు. వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరు కేవలం 57 బంతుల్లో 112 పరుగుల జోడించడంతో టీమ్ఇండియా 300 పరుగులను దాటింది.