ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు భారీ షాక్
India docked two WTC points for slow overrate at Edgbaston.మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అన్నచందంగా టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 6 July 2022 11:56 AM ISTమూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అన్నచందంగా టీమ్ఇండియా పరిస్థితి తయారైంది. ఇప్పటికే ఐదో టెస్టులో ఓటమితో బాధలో ఉన్న భారత్‌కు ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) భారీ షాకిచ్చింది. ఐదో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌పై ఐసీసీ చర్య తీసుకుంది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల నుంచి 2 పాయింట్లు కోత విధించింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో టీమ్ఇండియా నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా(84పాయింట్లు, 77.78 శాతం), దక్షిణాఫ్రికా(60పాయింట్లు, 71.43 శాతం), పాకిస్థాన్(44పాయింట్లు, 52.38 శాతం), భారత్(75 పాయింట్లు 52.08 పాయింట్ల శాతం) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల శాతం ఆధారంగా జట్ల స్థానాలను నిర్ణయిస్తారు.
ఓటమిపై ద్రవిడ్ ఏమన్నాడంటే..?
మ్యాచ్ అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ఓటమిపై సాకులు చెప్పాలని అనుకోవడం లేదన్నాడు. తొలి మూడు రోజులు బాగానే ఆడినా నాలుగో రోజూ రెండో ఇన్నింగ్స్‌లో సరిగ్గా ఆడలేకపోయామని, బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో విఫలం అయ్యామని చెప్పాడు. మరోవైపు ఇంగ్లాండ్ చాలా గొప్పగా పోరాడి విజయం సాధించిందని, గెలిచేందుకు వారు అర్హులని అన్నాడు. ఈ ఓటమి ఖచ్చితంగా నిరాశకు గురిచేసిందన్నారు. గత కొన్ని నెలలుగా టీమ్ఇండియా ప్రత్యర్థుల 20 వికెట్లను తీయలేక ఇబ్బంది పడుతోందని, విదేశాల్లో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. ఈ అంశంపై దృష్టిపెడతామన్నారు.