1021 రోజుల తరువాత కోహ్లీ శతకొట్టాడు.. అఫ్గాన్ పై భారత్ ఘన విజయం
India defeat Afghanistan by 101 runs. 1021 రోజుల విరామానికి తెరదించుతూ కోహ్లీ శతకొట్టాడు
By తోట వంశీ కుమార్ Published on 9 Sept 2022 9:35 AM ISTపరుగుల యంత్రంగా గుర్తింపు పొందాడు విరాట్ కోహ్లీ. ఒకప్పుడు మంచి నీళ్లు తాగినంత సులువుగా శతకాలు బాదిన విరాట్.. మూడున్నరేళ్లుగా సెంచరీ కోసం పరితపిస్తున్నాడు. అర్థశతకాలు చేస్తున్నప్పటికీ వాటికి శతకాలుగా మలచలేకపోతున్నాడు. ఇక 71వ శతకం అందని ద్రాక్షగానే మిగిలుతాదేమోనన్న సందేహం కలుగుతున్న సమయంలో పాత విరాట్‌ను గుర్తుకు తెస్తూ సాధికారిక బ్యాటింగ్‌తో 1021 రోజుల విరామానికి తెరదించుతూ శతక్కొట్టేశాడు. అదీ మామూలుగా కాదు రెండొందలకు పైగా స్ట్రైక్ రేట్‌తో. తనపై భారం దిగిపోవడంతో ఓ నవ్వు నవ్వేశాడు. బ్యాటింగ్‌లో కోహ్లీ భారీ శతకం బాదగా.. బౌలింగ్‌లో భువీ ఐదు వికెట్లతో విజృంభిండంతో అఫ్గానిస్తాన్‌పై టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు విశాంత్రి తీసుకోగా అతడి స్థానంలో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. రోహిత్ గైర్హజరీలో ఓపెనర్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ( 122 నాటౌట్; 61 బంతుల్లో12ఫోర్లు, 6సిక్స్‌లు) వీరవిహారం చేస్తూ.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. మరో ఓపెనర్, తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ (62; 41 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించడంతో టీమ్ఇండియా భారీ స్కోర్ చేసింది. అప్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌కు టీమ్ఇండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ చుక్కలు చూపించాడు. పాక్, లంక ల పై కీలకమైన 19వ ఓవర్‌లో పేవలంగా బౌలింగ్ చేసి విమర్శలు ఎదుర్కొన్న భువనేశ్వర్ తాను లయను అందుకుంటే ఎలా ఉంటుందో చూపించాడు. అప్గాన్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 4-1-4-5 సెల్ప్‌తో అదరగొట్టాడు. ఫలితంగా అఫ్గాన్ 21 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కనీసం 50 పరుగులైనా చేయడం కష్టమే అనిపించింది. అయితే.. ఇబ్రహీం జద్రాన్(64 నాటౌట్) ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులే చేసింది. ఫలితంగా టీమ్ఇండియా 101 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ శతకం వారికే అంకితం..
మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. "నిజాయతీగా చెప్పాలని అనుకుంటున్నా. గత రెండున్నరేళ్ల కాలం నాకెంతో నేర్పింది. ఈ రోజు నా ఇన్నింగ్స్ చూసి నాకే ఆశ్చర్యమేసింది. అసలు ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేస్తానని అనుకోలేదు. జట్టు ఎప్పుడూ నాకు మద్దుతుగా నిలిచింది. త్వరలో 34వ పడిలో అడుగుపెడుతున్నా. కాబట్టి ఒక్కప్పటిలా ఊగిపోతూ శతక సంబరాలు చేసుకోలేదు. క్లిష్ట సమయాల్లో నా భార్య అనుష్క శర్మ వెన్నంటే నిలిచింది. అందుకనే నన్ను మీరిక్కడ చూడగలుగుతున్నారు. ఈ శతకాన్ని అనుష్కతో పాటు నా కుమారై వామికాకు అంకితం చేస్తున్నా. ఆరువారాల విరామం నాలో ఉత్తేజాన్ని నింపింది. నేనెంత అలసిపోయానే విషయాన్ని చెప్పింది. విరామం తరువాత రాగానే ప్రాక్టీస్ సెషన్‌లో చాలా సమయం గడిపా.. తిరిగి లయను అందుకున్నా" అని విరాట్ కోహ్లీ అన్నాడు.