సుధీర్ఘ ఫార్మాట్‌లో టీమ్ఇండియా సత్తా చాటుతోంది. గతంలో విదేశాల్లో మ్యాచ్ అంటే.. గెలవడం సంగతి అటు ఉంచితే.. కనీసం డ్రా చేసుకుంటేనే పెద్ద గొప్ప సంగతిగా బావించేవారు. అయితే.. ఇటీవల ఆ పరిస్థితి మారింది. విదేశాల్లోనూ తాము గెలవగలం అని జట్టు నిరూపిస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. సమిష్టి తత్వంతో పోరాడుతూ.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది టీమ్ఇండియా. అందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్‌లే ఉదాహరణ. గెలుపు అసాధ్యం అన్న చోటు నుంచి తీవ్ర ఒత్తడిని అధిగమిస్తూ.. కుర్రాళ్లు చూపిస్తున్న తెగువ నిజంగా ప్రశంసనీయం. ఈ విజయాల్లో బౌలర్ల పాత్ర వెలకట్టలేనిది. ముఖ్యంగా బుమ్రా, షమి, ఉమేష్ యాదవ్, శార్దూల్, సిరాజ్ వంటి వారు విదేశాల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.
ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించిన కోహ్లీ సేన ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్(2021-2023) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. రెండో స్థానంలో పాకిస్థాన్ ఉండగా.. ఆ తరువాత వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లు ఉన్నాయి. భారత్ ఖాతాలో 26 పాయింట్లు ఉన్నాయి. పాక్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. ఓటముల శాతం ఎక్కువగా ఉండడంతో పాక్, వెస్టిండీస్ (12)ల తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది.