ఉత్కంఠ‌పోరులో భార‌త్ విజ‌యం.. సిరీస్ మ‌న‌దే

India beat West Indies by 8 runs take unassailable 2-0 lead in series.ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2022 3:10 AM GMT
ఉత్కంఠ‌పోరులో భార‌త్ విజ‌యం.. సిరీస్ మ‌న‌దే

ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 2-0 కైవ‌సం చేసుకుంది. శుక్ర‌వారం కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో ఒత్తిడిని అధిగ‌మిస్తూ 8 ప‌రుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో తొలిసారి ప్ర‌తిఘ‌ట‌న క‌న‌బ‌రిచిన వెస్టిండీస్ జ‌ట్టు చివ‌రి వ‌ర‌కు అదే జోరు క‌న‌బ‌ర‌చ‌డంలో విఫ‌లమైంది. వన్డే సిరీస్‌లో వైట్‌ వాష్‌కు గురైన కరీబియన్లు.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లోనూ ఆ ప్రమాదం అంచున నిలిచారు. కాగా.. టి20ల్లో భారత్‌కిది 100వ విజయం కావ‌డం విశేషం.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రిష‌బ్ పంత్‌ (28 బంతుల్లో 52 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లీ (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ‌శ‌త‌కాల‌తో ఆక‌ట్టుకుకోగా.. ఆల్‌రౌండ‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్‌ (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. అనంతరం వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది.

పావెల్‌ (36 బంతుల్లో 68 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్‌ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) లు మెరుపు ఇన్నింగ్స్‌ల‌తో భార‌త్‌ను భ‌య‌పెట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 60 బంతుల్లోనే 100 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. ఆఖ‌ర్లో భువ‌నేశ్వ‌ర్ కుమార్(1/29) అద్భుతంగా బౌలింగ్ చేసి వెస్టిండీస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. చాహ‌ల్‌(1/31), ర‌వి బిష్ణోయ్‌(1/30) ప‌ర్వాలేద‌నిపించారు. ఇక చివ‌రి టీ20 ఆదివారం ఇదే వేదిక‌పై జ‌ర‌గ‌నుంది.

Next Story
Share it