వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ఇండియా ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఘనంగా మొదలెట్టింది. తొలుత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ విధ్వంసం సృష్టించగా.. ఆ తరువాత భువనేశ్వర్ కుమార్‌కు తోడు మిగతా బౌలర్లు సత్తా చాటడంతో లక్నో వేదికగా జరిగిన తొలి టీ20లో 62 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థశతకాలతో బౌలర్లను ఊచకోత కోయగా.. రోహిత్ శర్మ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. దీంతో భారత్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక బౌలర్లలో దసున్ షనక, లహిరు కుమార చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. చరిత్ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలం అయ్యారు. దీంతో భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది.