సిరీస్ సమం.. దంచికొట్టిన కార్తీక్.. విజృంభించిన అవేశ్
India beat South Africa by 82 runs in 4th T20I.ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2022 9:40 AM ISTఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమిష్టి కృషితో టీమ్ఇండియా విజయం సాధించింది. శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో సఫారీలపై 82 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇక నిర్ణయాత్మకమైన ఆఖరి టీ 20 ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరగనుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. వెటరన్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ (55; 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ శతకంతో ఆకట్టుకోగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (46; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. టీ20ల్లో దినేశ్ కార్తీక్‌కు ఇదే తొలి అర్థశతకం కావడం గమనార్హం.
కీలకమైన మ్యాచ్‌లో భారత్‌కు పేలవ ఆరంభం దక్కింది. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 56/3తో నిలిచింది. రుతురాత్ (5), ఇషాన్ కిషన్(27), శ్రేయస్ అయ్యర్(4) విఫలం అయ్యారు. ఇక పంత్(17) కూడా పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. దీంతో టీమ్ఇండియా 15 ఓవర్లకు 96/4 తో నిలిచింది. ఇక్కడ నుంచి కార్తీక్, పాండ్యా విధ్వంసం మొదలైంది. ముఖ్యంగా కార్తీక్ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ చూడముచ్చటైన షాట్లతో అలరించారు. వీరిద్దరి ధాటికి భారత్ చివరి 5 ఓవర్లలో 73 పరుగులు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి రెండు,జాన్సన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాప్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమైంది. డసెన్ (20) టాప్ స్కోరర్ కాగా.. మిల్లర్ (9), క్లాసెన్ (8), ప్రిటోరియస్ (0), డికాక్ (14) విఫలం అయ్యారు. కెప్టెన్ టెంబా బవుమా (8) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో మూడు పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టడంతో పాటు డికాక్‌ను రనౌట్ చేశాడు. చహల్ కూడా రెండు వికెట్లతో మెరిశాడు.