సిరీస్ మనదే.. మరో మ్యాచ్ మిగిలిఉండగానే
India beat New zealand by 7 wickets.టీ20 ప్రపంచకప్ లో లీగ్ దశలోనే నిష్ర్కమించిన టీమ్ఇండియా ఆ పరాభవం
By తోట వంశీ కుమార్ Published on 20 Nov 2021 10:06 AM ISTటీ20 ప్రపంచకప్ లో లీగ్ దశలోనే నిష్ర్కమించిన టీమ్ఇండియా ఆ పరాభవం నుంచి తొందరగానే కోలుకుంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. కొత్త కోచ్ ద్రావిడ్, కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో సరికొత్తగా టీమ్ఇండియా కనబడుతోంది. శుక్రవారం రాత్రి రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (15 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫిలిప్స్ (34) , మిచెల్ (31) లు రాణించారు. అనంతరం ఓపెనర్లు కేఎల్ రాహుల్ (49 బంతుల్లో 65; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 55; ఒక ఫోర్, 5 సిక్సర్లు) లు దంచికొట్టడంతో టీమ్ఇండియా 154 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేదించింది. చివరి టీ20 మ్యాచ్ ఆదివారం కోల్‌కతాలో జరుగుతుంది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గొప్పగా రాణించారని, జట్టు బాగా ఆడిందన్నారు. ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యమైన విషయమని.. ఇతర విషయాలను వాళ్లే చూసుకుంటారన్నాడు. ఇదో యువకుల జట్టు అని. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదన్నాడు. ఇక తరువాతి మ్యాచ్‌లో మార్పులు, చేర్పులపై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుందని.. జట్టుకు ఏదీ అవసరమో అదే చేస్తామని తెలిపాడు. ఇప్పుడు రాణిస్తున్న వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నాడు. అవకాశం రాని వారికి కూడా సమయం, సందర్భాన్ని బట్టి ఆడే వీలు కల్పిస్తామని రోహిత్ చెప్పుకొచ్చాడు.