గెలుపుతో ఆరంభం
India beat New Zealand by 5 wickets in 1st t20.టీమ్ఇండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్, కొత్త కెప్టెన్ రోహిత్ శర్మలు
By తోట వంశీ కుమార్ Published on 18 Nov 2021 9:02 AM ISTటీమ్ఇండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్, కొత్త కెప్టెన్ రోహిత్ శర్మలు విజయంతో తమ ప్రస్థానాన్ని ఆరంభించారు. జైపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని సాధించింది. తొలుత అశ్విన్(2/23), భువనేశ్వర్(2/24) లు రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ గుప్టిల్ (70), మార్క్ చాప్‌మన్(63) లు రాణించారు. అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేదించింది. చేధనలో ఓపెనర్ రోహిత్ శర్మ (48; 36 బంతుల్లో 5 పోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(62; 40 బంతుల్లో 6పోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా ఆడారు. విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం రాంచీలో జరుగుతుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ మిచెల్ పరుగుల ఖాతా తెరవకుండానే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ గుప్టిల్‌కు జత కలిసిన మార్క్ చాప్‌మన్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడం కివీస్ బ్యాట్స్‌మెన్లకు కష్టంగా మారింది. దీంతో 10 ఓవర్లకు కివీస్ 65 పరుగులే చేసింది. పది ఓవర్ల అనంతరం కివీస్ బ్యాట్స్‌మెన్లు వేగం పెంచారు. ముఖ్యంగా అప్పటి వరకు నెమ్మదిగా గుప్టిల్ వేగం పెంచడంతో స్కోర్ బోర్డు వేగంగా కదిలింది. మరో పక్క చాప్‌మన్, ఫిలిప్స్(0) ఔటైనా కూడా గుప్టిల్ మాత్రం భారీ షాట్లతో విరుచుకుపడడంతో 17.1 ఓవర్లలో కివీస్ 150/3 గా నిలిచింది. చాహర్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన గుప్టిల్ మరో బారీ షాట్ ఆడబోయి శ్రేయాస్ చేతికి చిక్కాడు. చివరి మూడు ఓవర్లను భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ 23 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్(15) ఆది నుంచే కివీస్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ముందుకు సాగారు. తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అనంతరం రాహుల్ ఔటైనా.. సూర్యకుమార్ జతగా రోహిత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ తనదైన షాట్లను ఆడుతూ భారత్‌ను లక్ష్యం దిశగా నడిపించాడు. బౌల్ట్ బౌలింగ్‌లో రోహిత్ ఔటైనా.. సూర్యకుమార్ తన జోరు తగ్గించలేదు. పంత్(17 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపిస్తూ సిక్సర్‌తో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 18 బంతుల్లో 21 పరుగులు అవసరమైన దశలో సూర్యకుమార్ రివర్స్ స్పీప్‌షాట్‌కు యత్నించి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్(5) ధాటిగా ఆడలేకపోవడంతో చివరి ఓవర్‌లో భారత్ 10 పరుగులు అవసరం అయ్యాయి. మిచెల్ వేసిన చివరి ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్ ఓ ఫోర్ బాది తరువాతి బంతికి అతడు ఔటైపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అక్షర్‌పటేల్(1 నాటౌట్) సింగిల్ తీసి పంత్‌కు స్ట్రైకింగ్ ఇవ్వగా.. బౌండరీతో పంత్ జట్టును గెలిపించాడు.