ఉప్పల్‌ను ఊపేశారు.. అటు గిల్.. ఇటు బ్రాస్‌వెల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం
India beat New Zealand by 12 runs despite Bracewell scare.ఉప్పల్ మైదానం అభిమానులకు కావాల్సినంత మజాను
By తోట వంశీ కుమార్
నాలుగేళ్ల తరువాత ఉప్పల్ మైదానం అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కు ఆతిధ్యం ఇచ్చింది. ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత మజాను ఇచ్చింది. వన్డే మ్యాచ్‌లో అసలు సిసలు మజా ఏంటో రుచి చూపించింది. గిల్ ద్విశతకంతో టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది. లక్ష్య చేధనలో 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది కివీస్. ఈ దశలో టీమ్ఇండియా ఘన విజయం సాధిస్తుందని అందరూ బావించారు. ఉప్పల్ మైదానంలోని ప్రేక్షకులు సంబరాలకు సిద్దం అయిపోయారు.
అయితే.. అప్పుడే అసలు కథ మొదలైంది. బ్రాస్‌వెల్(140; 78 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్ గమనాన్ని ఒక్కసారిగా మార్చేశాడు. అసలు పోటీలో లేకుండానే పోయిన న్యూజిలాండ్‌ను తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆటలోకి తీసుకువచ్చాడు. అతడికి స్పిన్ ఆల్‌రౌండర్ శాంట్నర్(57; 45 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) జత కలవడంతో భారత అభిమానుల్లో ఏదో ఒక మూల టెన్షన్ మొదలైంది.
చూస్తుండగానే లక్ష్యం కరగసాగింది. ఏడో వికెట్ కు వీరిద్దరూ 162 పరుగులు జోడించారు. వీళ్ల ఊపు చూస్తుంటే ఆ సమయంలో మ్యాచ్ చేజారిపోతుందనే అనిపించింది. అప్పుడు వచ్చాడు లోకల్ బాయ్ సిరాజ్. ఒకే ఓవర్‌లో శాంట్నర్, షిప్లీ(0) లను ఔట్ చేశాడు. అయినప్పటికీ బ్రాస్‌వెల్ ఉండడంతో కివీస్ మ్యాచ్‌పై ఆశలు వదులుకోలేదు. ఆఖరి ఓవర్ తొలి బంతిని బ్రాస్‌వెల్ సిక్సర్ కొట్టడంతో విజయ సమీకరణం 5 బంతుల్లో 13 పరుగులుగా మారింది.
ఆ సమయంలో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. అయితే.. తరువాతి బంతికే చివరి వికెట్ రూపంలో బ్రాస్‌వెల్ ఔట్ కావడంతో రోహిత్ సేన ఊపిరిపీల్చుకుంది. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, కుల్‌దీప్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్( 208; 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు) ద్విశతకంతో అలరించాడు. 45,124,164 వ్యక్తిగత స్కోర్ల వద్ద గిల్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మిగిలిన వారిలో రోహిత్ 34, కోహ్లీ 8, ఇషాన్ కిషన్ 5, సూర్యకుమార్ యాదవ్ 31, హార్థిక్ పాండ్య 28 పరుగులు చేశారు. రు జట్ల మధ్య రాయ్‌పూర్‌లో శనివారం రెండో వన్డే జరగనుంది.