విజయంతో ఆ ఇద్దరికి ఘన వీడ్కోలు.. కోహ్లీ భావోద్వేగం
India beat Namibia in T20 World cup 2021.టీ 20 ప్రపంచకప్ 2021 టోర్నీలో సెమీస్ చేరుకోలేకపోయిన భారత జట్టు
By తోట వంశీ కుమార్ Published on 9 Nov 2021 3:44 AM GMTటీ 20 ప్రపంచకప్ 2021 టోర్నీలో సెమీస్ చేరుకోలేకపోయిన భారత జట్టు నామమాత్రపు చివరి మ్యాచ్‌లో పసికూన నమీబియాను చిత్తు చేసి విజయంతో టోర్నీని విజయంతో ముగించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టింది. కెప్టెన్‌గా కోహ్లీకి, ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఇద్దరికి ఇదే చివరి మ్యాచ్ కావడంతో.. కప్‌ను గెలవకున్నా చివరి మ్యాచ్‌లో గెలుపును కానుకగా ఇచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. డేవిడ్ వీజ్ (26), బార్డ్ (21) రాణించారు. భారత బౌలర్లలో జడేజా (3/16), అశ్విన్ (3/20), బుమ్రా (2/19) సత్తా చాటారు. అనంతరం.. రోహిత్ శర్మ (37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 నాటౌట్) చెలరేగడంతో స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి చేదించింది.
ఇకపై దూకుడు కొనసాగిస్తా..
ఇక మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. గత ఆరేడేళ్ల నుంచి తనపై తీవ్ర పనిభారం, ఒత్తిడి ఉందని చెప్పాడు. ఇప్పుడు చాలా రిలీఫ్‌గా ఫీలవుతున్నానన్నాడు. కెప్టెన్‌గా ఉండడం నిజంగా గొప్ప గౌరవం అని తెలిపాడు. ఇక ఈ టోర్నీలో తాము అనుకున్న ఫలితాలు రాలేదని.. అయినప్పటికీ ఆటగాళ్లు చాలా బాగా ఆడారనని చెప్పాడు. పొట్టి ఫార్మాట్‌లో మొదటి రెండు ఓవర్లలోనే ఎవరు పై చేయి సాధిస్తారో వారి ఆధిపత్యం కొనసాగుతుందన్నాడు.
తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించలేకపోయామని.. ఆ మ్యాచ్ లు ఎంతో కఠినంగా సాగాయన్నాడు. ఇన్నేళ్ల పాట తనతో పనిచేసిన కోచ్ రవిశాస్త్రి, అతని వ్యక్తిగత సిబ్బందికి ధన్యవాదాలు చెప్పాడు. వారు గొప్ప బాధ్యతలు నిర్వర్తించారని.. ఆటగాళ్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా కృషి చేశారన్నాడు. ఇకపై కూడా మునుపటి దూకుడు కొనసాగుతుందని కోహ్లి చెప్పాడు. ఆ దూకుడే గనుక చూపనినాడు తాను క్రికెట్ ఆడటం మానేస్తానని.. కెప్టెన్ కాకముందు కూడా అవతలి వ్యక్తికి ఎలాగైతే సహకరించానో ఇప్పుడు అలాగే సహకరిస్తానని కోహ్లీ తెలిపాడు.
ఆటగాళ్లు అలసిపోయారు..
టీమ్ఇండియా గత ఆరు నెలలుగా కరోనా నిబంధనలు పాటిస్తూ బయో బబులోనే ఉంది. నేను మానసికంగా మాత్రమే అలసిపోయా.. ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా కూడా అలసిపోయారు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌ల మధ్య ఇంకొంచెం సమయం ఉండే బాగుండేది. అయితే.. మా వైఫల్యానికి దీనిని కారణంగా చూపం. ఓటమికి భయపడట్లేదు. గెలవాలని చేసే ప్రయత్నంలో కొన్ని సార్లు ఓటములు ఎదురవుతాయి. ప్రధాన కోచ్ పదవి చేపట్టినప్పటి నుంచి భారత జట్టులో మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నా.. మార్పులు తీసుకువచ్చాననే భావిస్తున్నా.. గత ఐదేళ్లలో భారత ఆటగాళ్లు అన్ని దేశాల్లో.. అన్ని రకాల ఫార్మాట్లో రాణించిన తీరు చూస్తుంటే క్రికెట్ చరిత్రలో ఇది ఒక గొప్ప జట్లుగా నిలుస్తుందని రవిశాస్త్రి అన్నారు.