కుర్రాళ్లు కుమ్మేశారు.. ఐదో సారి ప్రపంచకప్ విజేతగా భారత్
India Beat England By 4 Wickets In Final To Win Record-Extending 5th Title U-19 World Cup.సమిష్టి ప్రదర్శనతో
By తోట వంశీ కుమార్ Published on 6 Feb 2022 3:24 AM GMTసమిష్టి ప్రదర్శనతో ఐదోసారి అండర్-19 ప్రపంచకప్‌ను ముద్దాడింది యువ భారత్. వెస్టిండీస్ అతిథ్యమిచ్చిన అండర్-19 ప్రపంచకప్-2022 టోర్నిలో తమ జైతయాత్రను కొనసాగిస్తూ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించింది యశ్ ధుల్ నాయకత్వంలోని టీమ్ఇండియా. తొలుత బౌలర్లు రాజ్ బవా, రవి కుమార్ ఇంగ్లండ్ నడ్డి విరివగా.. అనంతరం బ్యాటర్లు షేక్ రషీద్, నిషాంత్ సింధు సమయోచిత హాఫ్ సెంచరీలతో భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. భారత పేసర్లు రాజ్ బవా(5/34), రవి కుమార్ (4/34) ఇంగ్లాండ్ జట్టును వణికించారు. దీంతో ఓ దశలో ఇంగ్లాండ్ 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో ఆ జట్టు కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే.. జేమ్స్ రూ (116 బంతుల్లో 95; 12 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అతడికి జేమ్స్ సేల్స్ (65 బంతుల్లో 34 నాటౌట్; 2 పోర్లు) నుంచి కాస్త సహకారం లబించింది. శతకానికి చేరువైన జేమ్స్.. రవికుమార్ బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో 93 పరుగుల 8వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.
అనంతరం 190 పరుగులు మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రఘువంశీ పరుగుల ఖాతా తెరవకుండానే రెండో బంతికే డకౌట్ అయ్యాడు. కాగా.. సెమీస్‌లో కీలక పాత్ర పోషించిన వైస్ కెప్టెన్, ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు).. హర్నర్(21), కెప్టెన్ యశ్ ధుల్(17)లతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే.. ఇంగ్లాండ్ బౌలర్ సేల్స్ స్వల్ప వ్యవధిలో రషీద్,యశ్ ధుల్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను పోటిలోకి తెచ్చాడు. ఈ దశలో నిశాంత్ (54 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యాయుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా యువ భారత్ ఐదోసారి టైటిల్‌ను ముద్దాడింది.