టెస్టు హిస్టరీలో 'గిల్' సేన రికార్డు..58 ఏళ్ల తర్వాత అక్కడ విక్టరీ

అండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా చరిత్రాత్మక విక్టరీని తన ఖాతాలో వేసుకుంది.

By Knakam Karthik
Published on : 7 July 2025 7:49 AM IST

Sports News,  Anderson-Tendulkar Trophy, Edgbaston, India beat England

టెస్టు హిస్టరీలో 'గిల్' సేన రికార్డు..58 ఏళ్ల తర్వాత అక్కడ విక్టరీ

అండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా చరిత్రాత్మక విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో బోణీ కొట్టింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. అసలే సీనియర్లు లేని కాలం.. పైగా, గిల్ కెప్టెన్సీపై పలువురు మాజీల విసుర్లు.. గెలిచే మ్యాచ్ను చేజేతులా వదిలేశాడని, రివ్యూలు కోరడంతో తడబడుతున్నాడని విమర్శలు.. తొలి టెస్టులో ఓటమి.. ఇన్ని ప్రతికూలతల మధ్య శుభమన్ గిల్ తన సత్తా ఏంటో చాటాడు. తనతో పాటు తన టీంను కూడా అద్భుతంగా నడిపించి... రెండో టెస్టులో భారీ విజయాన్ని భారత్ ఖాతాలో వేశాడు. 336 పరుగుల భారీ తేడాతో ఎడ్జ్ బాస్టన్లో 58 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు.

58 ఏళ్లుగా ఎడ్జ్ బాస్టన్‌లో టీమిండియాకు ఒక్క విజయం కూడా దక్కలేదు. సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, ధోనీ, కోహ్లి.. ఇలా దిగ్గజ ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా ఎడ్జ్‌బాస్టన్‌లో ఓటమే ఎదురైంది. 1967లో టీమ్ఇండియా మొదటిసారి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత 1974, 1979, 1986 (డ్రా) , 1996, 2011, 2018, 2022లో ఒకసారి డ్రా, మిగిలిన మ్యాచ్​లన్నింటిలో భారత్ ఓడింది. అలాంటిది గిల్ నేతృత్వంలోని భారత జట్టు బెన్ స్టోక్స్ సేనను ముప్పతిప్పలు పెడుతూ చిరస్మరణీయ విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(269, 161) విధ్వంసక బ్యాటింగు.. ఆకాశ్ దీప్(6-99), సిరాజ్ (6-70) అద్భత బౌలింగ్ తోడవ్వగా చరిత్రలో నిలిపోయే విక్టరీ సాధించింది. ఆల్ రౌండ్ షోతో అతథ్య జట్టును వణికించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ బృందంపై 336 పరుగులతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జులై 10 నుంచి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరగనుంది.

Next Story