రోహిత్ దంచాడు.. కోహ్లీ కొట్టాడు.. సూర్యకుమార్, పాండ్య ఉతికేశారు
India beat england 36 runs.టెస్టు సిరీస్‌లో శనివారం జరిగిన నిర్ణయాత్మక పోరులో 36 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
By తోట వంశీ కుమార్ Published on 21 March 2021 5:51 AM GMTటెస్టు సిరీస్‌లో లాగే టీ20 సిరీస్‌లోనూ ఓటమితో మొదలెట్టిన టీమ్ఇండియా చివరికి సిరీస్ 3-2తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నిర్ణయాత్మక పోరులో 36 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మొదట ఓపెనర్లు కోహ్లీ(80; నాటౌట్ 52 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (64; 34 బంతుల్లో 4పోర్లు, 5 సిక్సర్లు)లకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(32; 17 బంతుల్లో 3పోర్లు, 2 సిక్సర్లు). హార్థిక్ పాండ్య (39 నాటౌట్; 17 బంతుల్లో 4పోర్లు 5 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం డేవిడ్ మలన్(68; 46 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్సర్లు) జోస్ బట్లర్(52; 34 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడి ఇంగ్లాండ్ శిబిరంలో ఆశలు రేపిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ భువనేశ్వర్ కుమార్(2/15), శార్దుల్ ఠాకూర్(3/45) వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులే చేసింది.
ఎట్టకేలకు బ్యాటింగ్‌లో దుమ్ములేపిన భారత్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది భారత్. రోహిత్‌కు తోడుగా కెప్టెన్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. గత రెండు మ్యాచ్‌ల్లో విపలమైన రోహిత్.. ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. బౌండరీలతో హోరెత్తించాడు. బౌలర్ ఎవరన్నది సంబంధం లేకుండా బంతిని బలంగా బాదాడు. ఫలితంగా భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. ఈ క్రమంలో రోహిత్ 30 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. అయితే స్టోక్స్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ముగిసింది. మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్.. రోహిత్‌ను మించి దూకుడుగా ఆడాడు. దీంతో స్కోర్ వేగం ఎక్కడా తగ్గలేదు. రషీద్ ఓవర్లో వరుసగా రెండు బంతులను సూర్య భారీ సిక్సర్లుగా మలచడం విశేషం. ఆ తర్వాత జోర్డాన్ బౌలింగ్‌లో అతను వరుసగా మూడు బంతుల్లో కొట్టిన మూడు ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. జోర్డాన్ అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కోహ్లి ఆ తర్వాత పుంజుకున్నాడు. అతడికి హార్థిక్ పాండ్య తోడు అయ్యాడు. దీంతో భారత్ చివరి ఐదు ఓవర్లలో 67 పరుగులు రాబట్టి ఇంగ్లాండ్ ముందు భారీ స్కోర్ ఉంచింది.
భయపెట్టిన ఆ ఇద్దరు..
భారీ ఛేదనలో ఇంగ్లాండ్ రెండో బంతికే రాయ్ (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే మలాన్, బట్లర్ కలిసి భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు పోటీ పడుతూ పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. అనంతరం కూడా వీరు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 11 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 120 చేరుకుంది. కోహ్లీ బౌలర్లను మార్చిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ దశలో భువి తనదైన మ్యాజిక్ చూపించాడు. 13 ఓవర్‌లో బట్లర్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇవ్వడంతో ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ దశలో భారత బౌలర్లు విజృంభించడంతో బెయిర్ స్టో(7), మలన్ , మోర్గాన్(1) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. దీంతో ఇంగ్లాండ్ ఓటమి ఖాయమైంది.