ఆదివారం విశాఖపట్నంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే రెండో వన్డేలో వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. విశాఖపట్నంలోని డాక్టర్ YSR ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 17వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరగనుంది. నాలుగేళ్ల తర్వాత ఈ వేదికపై మ్యాచ్ జరుగుతోంది. రేపు రెండో వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుంచి మొదలవుతుంది. విశాఖలో రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం చెప్పగా, శనివారం సాయంత్రం నగరంలో వర్షం కురిసింది.
మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్‌లన్నీ అమ్ముడయ్యాయి. మ్యాచ్‌ని చూసేందుకు హైదరాబాద్‌తోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా పలువురు తరలివస్తున్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న క్రికెట్ అభిమాని శేఖర్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు నేను, నా స్నేహితులు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చామని అన్నారు. IMD అమరావతి ప్రకారం రాబోయే మూడు రోజుల పాటు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలలో కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
వన్డే మ్యాచ్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు నగరానికి చేరుకున్నాయి. విశాఖ ఎయిర్ పోర్టులో క్రికెటర్లకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఇరుజట్ల ఆటగాళ్లు భారీ బందోబస్తు నడుమ ఎయిర్ పోర్టు నుంచి రాడిసన్ బ్లూ హోటల్ కు వెళ్లారు. వర్షం నేపథ్యంలో ఆటగాళ్ల ప్రాక్టీసు లేనట్టేనని తెలుస్తోంది.