కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ శతకంతో సత్తా చాటాడు. అరంగ్రేటం చేసిన మ్యాచ్‌లోనే శతకంతో దుమ్మురేపాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అయ్యర్.. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే 157 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అరంగ్రేటం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన భారత 16వ ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు. తొలి టెస్ట్ లోనే న్యూజిలాండ్ పై శతకం బాదిన మూడో ఆటగాడిగా.. అలాగే అరంగేట్ర మ్యాచ్ లోనే శతకం సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అయ్యర్ నిలిచాడు.
అంతక ముందు ఓవర్ నైట్ స్కోర్ 258/4 తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు ఒక్క పరుగుకు కూడా జోడించకుండానే జడేజా(50) పెవిలియన్ చేరాడు. శ్రేయాస్-జడేజా జోడి ఐదో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఆదుకుంటాడు అనుకున్న వృద్దిమాన్ సాహా(1) విఫలం కాగా.. శతకం చేసిన కాసేపటికే అయ్యర్ కూడా ఔట్ అయ్యాడు. మరికాసేపటికే అక్షర్(1) కూడా పెవిలియన్ చేరాడు. ఉమేష్ యాదవ్ (4) తోడుగా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (38) మరో వికెట్ పడకుండా సెషన్‌ను ముగించారు. దీంతో భారత్ 339/8 స్కోర్ తో లంచ్ కి వెళ్లింది.