టీ20 ప్రపంచకప్ జట్టులో తెలుగమ్మాయి అంజలికి చోటు
India announce squad for ICC Women's T20 World Cup 2023.దక్షిణాఫ్రికా వేదికగా 2023 ఫిబ్రవరిలో ఐసీసీ మహిళల టీ20
By తోట వంశీ కుమార్ Published on 29 Dec 2022 3:04 PM ISTదక్షిణాఫ్రికా వేదికగా 2023 ఫిబ్రవరిలో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఇందులో కర్నూలుకు చెందిన 25 ఏళ్ల అంజలి శర్వానికి చోటు దక్కింది. పేస్ బౌలర్ అయిన అంజలి ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణించింది. దీంతో ప్రపంచకప్ జట్టులో స్థానం లభించింది. సీనియర్ పేసర్ అయిన శిఖా పాండేకు కూడా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.
హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. గత ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ఇండియా ఓడిన సంగతి తెలిసిందే. ఈ సారి ఎలాగైనా ప్రపంచకప్‌ను ముద్దాడాలని హర్మన్ సేన గట్టి పట్టుదలతో ఉంది.
ప్రపంచకప్ కంటే ముందు భారత జట్టు దక్షిణాఫ్రికాలో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడనుంది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఈ సిరీస్‌లో పాల్గొననున్నాయి. జనవరి 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు కూడా జట్టును ప్రకటించారు. ఇందులో తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన కు చోటు దక్కింది.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు : హర్మన్ ప్రీత్‌కౌర్(కెప్టెన్), స్మృతి మందన(వైస్ కెప్టెన్), షెఫాలీవర్మ, యస్తికా భాటియా, రిచా ఘోష్, రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తిశర్మ, దేవికా వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్ర్తాకర్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖాపాండే.
ముక్కోణపు సిరీస్‌కు భారత జట్టు : హర్మన్ ప్రీత్‌కౌర్(కెప్టెన్), స్మృతి మందన(వైస్ కెప్టెన్), షెఫాలీవర్మ, యస్తికా భాటియా, రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తిశర్మ, దేవికా వైద్య, రాజేశ్వరీ గైక్వాడ్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, సుష్మా వర్మ, అమన్‌జ్యోత్ కౌర్, పూజా వస్ర్తాకర్, మేఘన, స్నేహ్ రానా, శిఖా పాండే