ఆటగాళ్లలో ఎటువంటి కరోనా లక్షణాలు లేవు
India and England players clear Covid-19 tests, to train from Tuesday. ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు భారతజట్టు లోని ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
By Medi Samrat
ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు భారతజట్టు లోని ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆటగాళ్లకు నెగటివ్ వచ్చిందని బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్లందరికీ కరోనా నెగటివ్ రావడంతో, వారంతా బయో బబుల్ లోకి వెళ్లిపోయారు. ఆరు రోజుల క్వారంటైన్ అనంతరం వీరికి పరీక్షలు నిర్వహించారు. కరోనా నిబంధనల మేరకు ఆటగాళ్లు ఎవరికీ కరోనా లేదని తేలింది. ప్రతి ఆటగాడి నుంచి మూడు సార్లు నమూనాలను సేకరించి పరిశీలించారు. అన్నింటిలోనూ నెగటివ్ వచ్చిందని తెలుస్తోంది.
ఇక టెస్ట్ సిరీస్ ఎటువంటి సమస్య లేకుండా ప్రారంభం కానుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి గురువారం వరకూ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. సోమవారం సాయంత్రమే కీలక ఆటగాళ్లు అవుట్ డోర్ ప్రాక్టీస్ కు వచ్చారు. ఇక ఈరోజు నుంచి మొత్తం ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ కు రానున్నారని అటు బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ లు తెలిపాయి. శ్రీలంక టూర్ కు అందుబాటులో లేకుండా పోయిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, బర్న్స్ క్వారంటైన్ పూర్తి చేసుకుని, ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ నెల 5న తొలి టెస్ట్ చెన్నైలో మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో, చివరి రెండు టెస్టులు అహ్మదాబాద్ లో జరగనున్నాయి.
ఇక చెన్నైలో జరగబోయే టెస్ట్ మ్యాచ్ లకు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులను అనుమతించడంపై అనిశ్చితి నెలకొంది. క్రీడా వేదికలకు వీక్షకులను అనుమతిస్తూ తాజా మార్గదర్శకాలు విడుదలైన నేపథ్యంలో, బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘం వర్గాల మధ్య చర్చలు జరిగాయి. రెండో టెస్టుకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు నిర్ణయించాయి. తమిళనాడు క్రికెట్ సంఘం అధికారి మాట్లాడుతూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ 50 శాతం ప్రేక్షకులతో టీమిండియా-ఇంగ్లాండ్ రెండో టెస్టు జరిపేందుకు నిర్ణయించామని తెలిపారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.