బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 336 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాట్స్‌మెన్లు పెద్దగా స్కోర్ చేయకున్నా.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు వాషింగ్టన్ సుందర్(62; 144 బంతుల్లో 7 పోర్లు, 1సిక్స్), శార్దూల్ ఠాకూర్(67; 115 బంతుల్లో 9పోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 33 పరుగుల ఆధిక్యం దక్కింది.
రెండు పరుగుల నష్టానికి 62 పరుగులతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌ను ఆసీస్ బౌలర్లు బోల్తా కొట్టించారు. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే.. పుజారా(25)ను హెజిల్‌వుడ్ పెవిలియన్ చేర్చాడు. యువ ఆటగాడు మయాంక్ అగ్వరాల్(38)తో జతకట్టిన కెప్టెన్ అజింక్య రహానే(37) జట్టును ముందుండి నడిపించాడు. 144 పరుగుల వద్ద రహానే, 161 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ వికెట్లను భారత్ కోల్పోయింది. ఆదుకుంటాడని బావించిన పంత్(23) కూడా తొందరగానే పెవిలియన్ చేరాడు. దీంతో టీమ్ఇండియా 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక భారత్ ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టదని అంతా అనుకున్నారు.
అయితే.. ఈ దశలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం. సుందర్ 108 బంతుల్లో 50 పరుగులు చేస్తే, శార్దుల్ 90 బంతుల్లో 53 పరుగులు పూర్తి చేసుకున్నాడు. శార్దుల్ ఠాకూర్‌కు ఇది తొలి టెస్ట్ హాఫ్ సంచరీ. వీరిద్దరు ఏడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు స్వల్ప వ్యవధిలో ఔట్ కాగా.. మిగిలిన వికెట్లు కోల్పోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆసీస్ బౌలర్లలో హెజిల్‌వుడ్ 5, స్టార్క్, కమిన్స్ చెరో రెండు వికెట్లు, లియోన్ ఓ వికెట్ పడగొట్టాడు.