గేర్ మార్చిన పుజారా.. పోరాడుతున్న టీమ్ఇండియా

India 215/2 at stumps trail by 139 runs.లీడ్స్‌లో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2021 9:15 AM IST
గేర్ మార్చిన పుజారా.. పోరాడుతున్న టీమ్ఇండియా

లీడ్స్‌లో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడుతోంది. 354 ప‌రుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భార‌త్ మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండు వికెట్ల న‌ష్టానికి 215 ప‌రుగులు చేసింది. న‌యా వాల్ పుజారా(91 నాటౌట్‌; 180 బంతుల్లో 15 పోర్లు) కెప్టెన్ కోహ్లీ( 45 బ్యాటింగ్‌; 94 బంతుల్లో 6 పోర్లు) క్రీజులో ఉన్నారు. భార‌త్ ఇంకా 139 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ఇంకా భార‌త్‌కు ఓట‌మి ముప్పు తొల‌గిపోలేదు. నాలుగో రోజంతా బ్యాటింగ్ చేయ‌డంతో పాటు వీలైనంత ఆధిక్యం సాధించాలి.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 423/8తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ మరో 9 పరుగులు జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 354 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. తొలి ఇన్నింగ్స్‌లో 78 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన‌ప్ప‌టికి రెండో ఇన్నింగ్స్‌లో భార‌త బ్యాట్స్‌మెన్లు అసాధార‌ణంగా పోరాడుతున్నారు. కేఎల్ రాహుల్ (8) విఫ‌ల‌మైన‌ప్ప‌టికి మ‌రో ఓపెన‌ర్ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) తో జ‌త క‌లిసిన పుజారా చ‌క్క‌గా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ ఓ వైపు క్రీజులో కుదురుకోగా.. పుజారా త‌న స‌హ‌జ శైలికి విరుద్దంగా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో అత‌డు బౌండ‌రీలు బాదాడు. పుజారా తొలి 13 బంతుల్లో 14 ప‌రుగులు చేయ‌డం విశేషం.

వీరిద్ద‌రు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో రోహిత్‌ 125 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే.. జ‌ట్టు స్కోరు 116 వ‌ద్ద రాబిన్స‌న్ బౌలింగ్ రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్‌-పుజారా రెండో వికెట్‌కు 82 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. రోహిత్ ఔట్ అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన కోహ్లీ.. పుజారాకు చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. కోహ్లీ త‌న‌దైన ట్రేడ్ మార్క్ షాట్ల‌తో అల‌రించాడు. 91 బంతుల్లో పుజ‌రా అర్థ‌శ‌త‌కం చేశాడు. వీరిద్ద‌రు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు అవ‌కాశ‌మే ఇవ్వ‌లేదు. రూట్ ఎంత మంది బౌల‌ర్ల‌ను మార్చినా.. ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. వీరిద్ద‌రు మ‌రో వికెట్ ప‌డ‌కుండా మూడో రోజు ఆట‌ను ముగించారు. అభేధ్య‌మైన మూడో వికెట్‌కు 99 ప‌రుగులు జోడించారు.

Next Story