విజృంభించిన బుమ్రా, ష‌మి.. ఇంగ్లాండ్ 183కే ఆలౌట్‌

India 21/0 at stumps after England 183 all out.నాటింగ్‌హామ్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టును భార‌త జ‌ట్టు ఘ‌నంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2021 2:43 AM GMT
విజృంభించిన బుమ్రా, ష‌మి.. ఇంగ్లాండ్ 183కే ఆలౌట్‌

నాటింగ్‌హామ్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టును భార‌త జ‌ట్టు ఘ‌నంగా ప్రారంభించింది.పేస‌ర్ల‌కు స‌హ‌క‌రిస్తున్న పిచ్‌పై భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో తొలి టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 183 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. జస్ప్రీత్‌ బుమ్రా (4/46), మహమ్మద్‌ షమీ (3/28), శార్దూల్‌ ఠాకూర్‌ (2/41), హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ (1/48) లు రాణించారు. అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భార‌త్ తొలి రోజు ఆట ముగిసే స‌మయానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగులు చేసింది. క్రీజులో ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(9 నాటౌట్‌), కేఎల్ రాహుల్‌(9 నాటౌట్‌) ఉన్నారు. రెండో రోజు భార‌త బాట్స్‌మెన్లు రాణిస్తే.. టెస్టుపై ప‌ట్టు సాధించ‌వ‌చ్చు.

టీ విరామం త‌రువాత మ‌లుపు తిరిగిన మ్యాచ్‌..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ ఐదో బంతికే బర్న్స్‌(0)ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. సిబ్లే (18), క్రాలీ (27) పోరాటంతో ఆతిథ్య జట్టు కోలుకుంది. వీరిద్దరూ వెనుదిరిగాక.. బెయిర్‌స్టో(29)తో కలిసి కెప్టెన్ జో రూట్‌ (108 బంతుల్లో 11 ఫోర్లతో 64) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఫలితంగా ఒక దశలో ఇంగ్లండ్‌ 138/3తో మెరుగైన దశలో కనిపించింది. అయితే టీ విరామానికి ముందు ఓవ‌ర్‌లో బెయిర్‌స్టోను ఔట్‌ చేసిన షమీ.. విరామాం అనంత‌రం ఓవ‌ర్ కొన‌సాగిస్తూ.. చివ‌రి బంతికి లారెన్స్(0) వికెట్‌ను తీశాడు.

ఇక్క‌డే మ్యాచ్ మలుపు తిరిగింది. బట్లర్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. రాబిన్‌సన్‌ (0), బ్రాడ్‌ (4), అండర్సన్‌ (1) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చివ‌ర్లో సామ్‌ కరన్‌ (27 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) విలువైన పరుగులు జోడించాడు. 45 పరుగుల వ్యవధిలో ఇంగ్లాండ్‌ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్ కు గాయం వ‌ల్ల ఇషాంత్ అందుబాటులో లేక‌పోవ‌డంతో అత‌డి స్థానంలో సిరాజ్‌ను ఎంచుకున్నారు. తుది జ‌ట్టులో ఒక స్పిన్న‌ర్‌కే చోటు ఇచ్చిన భార‌త్.. సీనియ‌ర్ స్పిన్న‌ర్ అశ్విన్‌ను కాద‌ని జ‌డేజాను తీసుకుంది. నాలుగో పేస‌ర్‌గా శార్ధూల్‌, ఓపెన‌ర్‌గా రాహుల్‌కు అవ‌కాశం ద‌క్కింది.

Next Story
Share it