తొలి రోజు మ‌న‌దే.. విజృంభించిన అశ్విన్‌, ఉమేష్‌

India 19/0 at stumps on Day 1 in 2nd test.మీర్పూర్ వేదికగా భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2022 11:24 AM GMT
తొలి రోజు మ‌న‌దే.. విజృంభించిన అశ్విన్‌, ఉమేష్‌

మీర్పూర్ వేదికగా భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. మ్యాచ్ ముగిసే స‌మ‌యానికి భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 19 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు గిల్ 14, కెప్టెన్ కేఎల్ రాహుల్ 3 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో బంగ్లాదేశ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 227 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బంగ్లా బ్యాట‌ర్లలో మామినుల్ హ‌క్‌(84) ఒక్క‌డే రాణించాడు. భార‌త బౌల‌ర్ల‌లో ఉమేశ్ యాద‌వ్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీయ‌గా, జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు శాంటో(24), జాకీర్ హ‌స‌న్ (15) లు తొలి వికెట్‌కు 39 ప‌రుగులు జోడించి స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్‌కు చేరారు. ఆ త‌రువాత వ‌చ్చిన‌ కెప్టెన్ ష‌కీబ్ అల్ హాస‌న్‌(16), మామినుల్ హాల్‌(84) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. అయితే లంచ్ త‌రువాత మొద‌టి బంతికే ఉమేష్ వీరి భాగ‌స్వామ్యాన్ని విడ‌తీశాడు. వీరిద్ద‌రు మూడో వికెట్ 43 ప‌రుగులు జ‌త చేశారు.

ఆ త‌రువాత వ‌చ్చిన బ్యాట‌ర్ల‌ను వ‌చ్చిన‌ట్లే భార‌త బౌల‌ర్లు పెవిలియ‌న్‌కు చేర్చారు. ముష్పిక‌ర్ ర‌హీం(26), లిట‌న్ దాస్‌(26), మెహ‌దీ మిరాజ్‌(15) లు ఒక‌రి త‌రువాత ఒక‌రు ఔటైయ్యారు. ఓవైపు వికెట్లు ప‌డుతున్నా మ‌రోవైపు మామినుల్ హ‌ల్ ఒంటిరి పోరాటం చేశాడు. ఈ క్ర‌మంలో అర్థ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. శ‌త‌కానికి మ‌రో 16 ప‌రుగుల దూరంలో తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఆ త‌రువాత బంగ్లా ఇన్నింగ్స్ ముగియ‌డానికి ఎంతో సేపు ప‌ట్ట‌లేదు.

అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భార‌త్ 8 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 19 ప‌ర‌గులు చేసింది.

Next Story
Share it