డబ్ల్యూటీసీ ఫైనల్‌.. రెండో రోజు భారత్‌ 146/3

India 146/3 as bad light forces early stumps on Day 2.తొలిసారి జ‌రుగుతున్న ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2021 2:43 AM GMT
డబ్ల్యూటీసీ ఫైనల్‌.. రెండో రోజు భారత్‌ 146/3

తొలిసారి జ‌రుగుతున్న ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కు ఆటంకాలు త‌ప్ప‌డం లేదు. తొలి రోజు కనీసం టాస్ వేయ‌కుండ‌నే ర‌ద్దు కాగా.. రెండో రోజు శ‌నివారం వెలుతురు లేమీతో 66.4 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో టీమ్ఇండియా అస‌లు సిస‌లైన టెస్టు బ్యాటింగ్ ఎంటో చూపించింది. రెండో రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ (124 బంతుల్లో 44 బ్యాటింగ్‌; 1 ఫోర్‌), అజింక్య రహానే (79 బంతుల్లో 29 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త జ‌ట్టుకు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (68 బంతుల్లో 34; 6 ఫోర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (64 బంతుల్లో 28; 3 ఫోర్లు) శుభారంభం అందించారు. న్యూజిలాండ్ బౌలర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న ఈ జోడి తొలి వికెట్‌కు 62 ప‌రుగులు జోడించారు. జేమిస‌న్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ స్లిప్‌లో దొరికిపోయాడు. తరువాత గిల్ ఎంతో సేపు నిల‌వ‌లేదు. వాగ్న‌ర్ త‌న తొలి ఓవ‌ర్‌లోనే అత‌డిని ఔట్ చేశాడు. దీంతో లంచ్ విరామానికి భార‌త్ 69/2 తో నిలిచింది.

ఈ దశలో కోహ్లి, పుజారా (54 బంతుల్లో 8; 2 ఫోర్లు) పరుగులు రాబట్టడంకంటే క్రీజ్‌లో నిలదొక్కుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. తన తొలి పరుగు కోసం పుజారా ఏకంగా 36 బంతులు తీసుకోగా, ఒక దశలో కోహ్లి కూడా వరుసగా 19 బంతుల పాటు పరుగు తీయలేదు. బౌల్ట్‌ చక్కటి బంతితో న‌యా వాల్ పుజారా ను వెనక్కి పంపాడు. దీంతో 88 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన‌ట్లు అనిపించింది. అయితే.. కెప్టెన్ కోహ్లీకి, వైస్ కెప్టెన్ ర‌హానే జ‌త క‌లిసాడు. ఇద్ద‌రూ కూడా కివీస్ పేస్ ప‌రీక్ష‌ను త‌ట్టుకుంటూ సింగిల్స్ తీస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్ద‌రు అభేద్య‌మైన నాలుగో వికెట్ కు 58 ప‌రుగులు జోడించారు. ఈ ద‌శ‌లో వెలుతురు మంద‌గించ‌డంతో ఆట‌ను తొంద‌ర‌గానే ముగించారు. వీరిద్ద‌రు మూడో రోజు ఎంత సేపు నిల‌బ‌డుతారు అన్న‌దానిపై భార‌త్ భారీ స్కోరు ఆధార‌ప‌డి ఉంది.

Next Story