రసవత్తరంగా కాన్పూర్ టెస్ట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ 14/1

India 14/1 in second innings at stumps day 3.కాన్పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Nov 2021 3:39 AM GMT
రసవత్తరంగా కాన్పూర్ టెస్ట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ 14/1

కాన్పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మంచి ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఆధిక్యం చేతులు మారుతూ వ‌స్తున్న ఈ మ్యాచ్ అభిమానుల‌కు అస‌లైన టెస్టు మ‌జాను అందిస్తోంది. సొంత‌గ‌డ్డ‌పై ప‌రిస్థితుల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ భార‌త్ ఓ వైపు చెల‌రేగుతుంటే.. అంతే ధీటుగా న్యూజిలాండ్ జ‌ట్టు గ‌ట్టి పోటీ ఇస్తుంది. సిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ విజృంభ‌ణ‌తో మూడో రోజు ఆట ముగిసే స‌రికి భార‌త్ ఈ మ్యాచ్‌పై ప‌ట్టు బిగిస్తోంది. ఇక నాలుగో రోజు భార‌త బ్యాట్స్‌మెన్లు ఎలా రాణిస్తారు అన్న‌దానిపైనే మ్యాచ్ ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంది. ప్ర‌స్తుతం భార‌త్ 63 ప‌రుగుల ఆధిక్యంలో ఉండ‌గా.. ఇంకా చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.

రెండో రోజు(శుక్రవారం) కివీస్ జ‌ట్టు ఒక్క వికెట్ తీయ‌లేక‌పోయిన భార‌త బౌల‌ర్లు శ‌నివారం మాత్రం స‌త్తా చాటారు. ప్ర‌త్య‌ర్థిని భారీ స్కోర్ చేయ‌కుండా అడ్డుకున్నారు. ఓవ‌ర్ నైట్ స్కోర్ 129/0తో మూడో రోజు ఆట‌ను ఆరంభించిన కివీస్.. భారీ స్కోర్ చేసేలా క‌నిపించింది. అయితే.. స్పిన్న‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్ (5/62), అశ్విన్‌(3/82) ధాటికి 296 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. ఓపెన‌ర్ లేథ‌మ్ (95) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా.. మ‌రో ఓపెన‌ర్ విల్ యంగ్‌(89) ప‌రుగుల‌తో రాణించాడు. వీరిద్ద‌రు తొలి వికెట్‌కు 151 ప‌రుగులు జోడించారు. వీరిద్ద‌రి త‌రువాత జేమీస‌న్(23) టాప్ స్కోర‌ర్‌. దీంతో భార‌త్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 49 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ను ప్రారంభించిన భారత్ కు ఆరంభంలోనే గట్టి ఎదుర‌దెబ్బ త‌గిలింది. తొలి ఇన్నింగ్స్‌లో అర్థ‌శ‌త‌కం చేసి ఫామ్‌లోకి వ‌చ్చిన ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(1) రెండో ఓవ‌ర్‌లోనే పెవిలియ‌న్ చేరాడు. కివీస్ పేస‌ర్ జేమీస‌న్ మ‌రోసారి గిల్‌ను బౌల్డ్ చేశాడు. మ‌రో ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌(4)తో జ‌త క‌లిసిన న‌యా వాల్ పుజారా(9) మ‌రో వికెట్ ప‌డ‌కుండా మూడో రోజును ముగించారు. ప్ర‌స్తుతం రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ స్కోర్ 14/1. మ‌రో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేప‌థ్యంలో ఆట మంచి ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇరు జ‌ట్ల‌కు విజ‌యావ‌కాశాలు ఉన్నాయి. నాలుగో రోజు భార‌త బ్యాట్స్‌మెన్లు రాణించి కివీస్‌కు 250 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్ధేశిస్తే.. చేదించ‌డం క‌ష్ట‌మ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

Next Story