శ‌త‌కంతో స‌త్తాచాటిన పంత్‌.. ప‌ట్టు బిగించిన భార‌త్‌

IND lead by 89 runs at stumps.అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా ప‌ట్టుబిగిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2021 12:15 PM GMT
IND lead by 89 runs at stumps

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా ప‌ట్టుబిగిస్తోంది. వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ (101; 118 బంతుల్లో 13 పోర్లు 2 సిక్స‌ర్లు)శ‌త‌కం బాద‌డంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 294 ప‌రుగులు చేసింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(60), అక్ష‌ర్ ప‌టేల్ (11) క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 89 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 24/1 రెండో రోజు ఆట‌ను కొన‌సాగించిన భార‌త్ మ‌రో 6 వికెట్లు కోల్పోయి మ‌రో 270 ప‌రుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేప‌టికే భార‌త్‌కు షాక్ త‌గిలింది. ఓవ‌ర్‌నైట్ స్కోర్‌కు మ‌రో రెండు ప‌రుగులు మాత్ర‌మే జోడించిన పుజారా(17) జ‌ట్టు స్కోర్ 40 పరుగుల వ‌ద్ద జాక్ లీచ్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియ‌న్ చేరాడు. రికార్డుల రారాజు, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకుంటాడ‌ని అంతా బావించ‌గా.. కోహ్లీ మాత్రం ఇలా వ‌చ్చి అలా వెళ్లాడు. 8 బంతులు ఆడిన కోహ్లీ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భార‌త్ 41 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌కు వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానే జ‌త క‌లిసాడు. ఓ వైపు రోహిత్ క్రీజులో పాతుకుపోగా.. ర‌హానే ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 45 బంతుల్లో 4 పోర్ల‌తో 25 ప‌రుగులు చేశాడు. స‌రిగ్గా లంచ్ విరామానికి ఒక బంతి ముందు ఔట‌య్యాడు. అండ‌ర్స‌న్ వేసిన ఇన్సింగ్స్ 37.5 బంతికి స్లిప్‌లో స్టోక్స్ చేతికి చిక్కాడు. దీంతో భార‌త్ నాలుగో వికెట్ కోల్పోయింది.

ఈ ద‌శ‌లో రోహిత్ శ‌ర్మ‌కు రిష‌బ్ పంత్ జ‌త క‌లిసాడు. వీరిద్ద‌రు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. ఐదో వికెట్‌కు 41 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన త‌రువాత రోహిత్ (49)అర్థ‌శ‌త‌కానికి ప‌రుగు దూరంలో స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియ‌న్ చేరాడు. దీంతో 121 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. మ‌రికాసేప‌టికే అశ్విన్‌(13) ను జాక్ లీచ్ ఔట్ చేశాడు. దీంతో భార‌త్ 146 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఈ ద‌శ‌లో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్లిపోయిన‌ట్లు అనిపించింది. అయితే.. రిష‌బ్ పంత్‌తో జ‌త క‌లిసిన వాషింగ్ట‌న్ సుంద‌ర్ మ్యాచ్ గ‌మ‌నాన్నే మార్చి వేశారు.

ఈ క్ర‌మంలో పంత్ అర్థ‌శ‌త‌కం అందుకున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు ఆచితూచి ఆడిన పంత్ త‌రువాత గేర్ మార్చాడు. ఇంగ్లాండ్ కొత్త బంతిని తీసుకోగానే బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డాడు. మ‌రో ఎండ్‌లో ఉన్న సుంద‌ర్ కూడా ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటూ ప‌రుగులు చేయ‌డంతో.. ఇంగ్లాండ్ బౌల‌ర్లు వీరి భాగ‌స్వామ్యాన్ని విడ‌గొట్ట‌లేక‌పోయారు. సుంద‌ర్ అర్థ‌శ‌త‌కం పూర్తి చేయ‌గా.. రూట్ బౌలింగ్‌లో సిక్స‌ర్‌తో పంత్ శ‌త‌కాన్ని అందుకున్నాడు. శ‌త‌కం అందుకున్న మ‌రుస‌టి ఓవ‌ర్‌లో అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో పంత్ భారీ షాట్‌కు య‌త్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియ‌న్ చేరాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌తో క‌లిసి పంత్‌ ఏడో వికెట్‌కు 113 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. పంత్ ఔట్ అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన అక్ష‌ర్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా సుంద‌ర్‌తో క‌లిసి రెండో రోజును ముగించారు.




Next Story