బుమ్రా పాంచ్ పటాకా.. విజయం దిశగా భారత్
Ind 52/1 at Stumps Chasing 209 for Win.నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు
By తోట వంశీ కుమార్ Published on 8 Aug 2021 7:13 AM ISTనాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు పట్టుబిగించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. పేసర్ బుమ్రా విజృంభించడంతో ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం తీసివేయగా.. భారత్ ముందు 209 పరుగుల లక్ష్యం నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. రాహుల్ 26 ఔట్ కాగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(12), పుజారా(12) క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా గెలవాలంటే మరో 157 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఇక భారమంతా బాట్స్‌మెన్లపైనే ఉంది.
అంతకుముందు నాలుగో రోజు ఉదయం ఓవర్‌నైట్ స్కోరు 25/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ ఓ దశలో 135/2 నిలిచింది. భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే.. ఆ దశలో పేస్ గుర్రం బుమ్రా (5/64) విజృంభించడంతో ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు కెప్టెన్ జో రూట్(109; 172 బంతుల్లో 14పోర్లు) సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. బెయిర్ స్టో(30), లారెన్స్(25), సామ్‌కరన్(32)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడంతో చివరికి ఇంగ్లాండ్ 303 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా (5/64)తో పాటు సిరాజ్ (2/84), శార్దుల్ (2/37 రాణించారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 278 పరుగులు చేసింది.