అదరగొట్టిన కోహ్లీ సేన.. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
ICC Test Rankings India dethrone New Zealand to claim top spot.టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో తమకు ఎదురైన
By తోట వంశీ కుమార్ Published on 7 Dec 2021 2:29 AM GMTటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో తమకు ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్‌పై టీమ్ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. తొలి టెస్టులో విజయానికి వికెట్ దూరంలో ఆగిపోయిన భారత్ రెండో టెస్టులో రికార్డు స్థాయిలో 372 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఆ జట్టును వెనక్కి నెట్టి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని కూడా సొంతం చేసుకుంది.
540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోర్ 140/5 తో నాలుగో రోజు సోమవారం ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు మరో 27 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లను జయంత్ యాదవ్ పడగొట్టగా.. చివరి వికెట్‌ను అశ్విన్(4/49) తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 325 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 62 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 276/7 వద్ద డిక్లేర్ చేయగా.. కివీస్ 167 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకం, రెండో ఇన్నింగ్స్‌లో అర్థశతకంతో రాణించిన మయాంక్ అగర్వాల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించగా.. అశ్విన్ కి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గా నిలిచాడు.
టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం..
కివీస్‌పై భారత్ భారీ విజయాన్ని సాధించడంతో టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ భారత్ స్థానం మెరుగైంది. 124 పాయింట్లతో కివీస్‌ను వెనక్కి నెట్టి టీమ్ఇండియా నంబర్ వన్‌గా నిలిచింది. రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్న కివీస్ 121 పాయింట్లతో రెండో ర్యాంకుకు పడిపోయింది. భారత్, కివీస్ తరువాత ఆస్ట్రేలియా(108), ఇంగ్గాండ్(107), పాకిస్తాన్(92 పాయింట్లు) లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.