'ఫిర్యాదు చేయాల్సింది మాకు కాదు'.. హ్యాండ్‌షేక్ వివాదంపై పీసీబీకి ఐసీసీ దిమ్మతిరిగే రిప్లై
ఆసియా కప్ 2025లో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత మొదలైన వివాదం ఆగడం లేదు.
By - Medi Samrat |
ఆసియా కప్ 2025లో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత మొదలైన వివాదం ఆగడం లేదు. బుధవారం దుబాయ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు హోటల్ నుంచి మైదానానికి వెళ్లేందుకు నిరాకరించడంతో పెద్ద డ్రామా జరిగింది. దీని కారణంగా, పాకిస్తాన్, యుఏఈ మధ్య ముఖ్యమైన గ్రూప్ A మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మొత్తం వివాదంపై కఠిన వైఖరిని తీసుకున్న ఐసీసీ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి తగిన సమాధానం ఇచ్చింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.
ఆదివారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ఘటన అంతా మొదలైంది. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగాతో కరచాలనం చేయలేదు. జట్టు షీట్లను మార్చుకోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాక్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం తెలిపేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఈ సందర్భంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను కరచాలనం చేయమని సల్మాన్ అలీని కోరినట్లు ఆరోపించింది. దీంతోపాటు టీమ్‌షీటు ఇవ్వరాదని ఇరువురు కెప్టెన్లకు ఆదేశాలు కూడా ఇచ్చారని ఆరోపించింది.
గ్రోస్వెనర్ హోటల్ నుంచి స్టేడియానికి వచ్చేందుకు పాకిస్థాన్ జట్టు నిరాకరించడంతో విషయం బుధవారం మరింత తీవ్రమైంది. ICC కూడా PCB రెండవ ఫిర్యాదును తిరస్కరించిం. ఆ తర్వాత ప్రతిష్టంభన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా మ్యాచ్ రాత్రి 8 గంటలకు కాకుండా రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది.
న్యూస్ ఏజెన్సీ పిటిఐ ప్రకారం.. పీసీబీకి వ్రాతపూర్వక సమాధానంలో ఐసిసి ఆరు పాయింట్లలో తన వివరణ ఇచ్చింది. 'పీసీబీ నివేదికలో ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఐసీసీ విచారణ జరిగింది. మేము నివేదికను సీరియస్‌గా తీసుకున్నాము, కానీ ఎలాంటి డాక్యుమెంటరీ సాక్ష్యాలు లేదా జట్టు ఆటగాళ్ల ప్రకటనలు దానితో జతచేయబడలేదు. ఆటగాళ్లకు స్టేట్‌మెంట్లు ఇచ్చేందుకు పీసీబీకి పూర్తి అవకాశం ఉందని, అయితే వారు అలా చేయలేదని ఐసీసీ స్పష్టం చేసింది.
రెండో పాయింట్‌లో మ్యాచ్ రిఫరీపై 'ఏ కేసు పెట్టలేం' అని ఐసీసీ రాసింది. మూడో పాయింట్ 'ఏసీసీ వెన్యూ మేనేజర్ స్పష్టమైన సూచనలకు అనుగుణంగానే మ్యాచ్ రిఫరీ చర్యలు ఉన్నాయి. అతడు టాస్‌కు కొన్ని నిమిషాల ముందు మాత్రమే ఈ సమాచారాన్ని పొందాడు.. కాబట్టి అతనికి వేరే మార్గం లేదు. ఐసీసీ కూడా.. పైక్రాఫ్ట్ లక్ష్యం 'టాస్ గౌరవాన్ని కాపాడుకోవడంతోపాటు ఎలాంటి సంభావ్య ఇబ్బందినైనా నివారించడం' మాత్రమే అని పేర్కొంది.
హ్యాండ్‌షేక్ చేయకూడదనే నిర్ణయం మ్యాచ్ రిఫరీది కాదని.. టోర్నమెంట్ నిర్వాహకులు, టీమ్ మేనేజర్‌లది అని ఐసిసి స్పష్టం చేసింది. కరచాలనం చేయలేదనేది పీసీబీ నిజమైన ఫిర్యాదు అయితే.. వారు టోర్నమెంట్ నిర్వాహకులు, నిర్ణయాధికారులకు (ఐసిసికి కాదు) ఈ ఫిర్యాదు చేయాలి. ఇందులో ఐసీసీ పాత్ర లేదు. ఈ విధంగా ఐసీసీ బంతిని ఎసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, టోర్నమెంట్ డైరెక్టర్ ఆండీ రస్సెల్ కోర్టులో ఉంచింది. ఐసీసీ కఠిన వైఖరిని బట్టి ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారనే విషయమై బంతి ఇప్పుడు పీసీబీ, ఏసీసీ కోర్టులో ఉంది.