అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు క్రికెటర్లపై కొరడా ఝుళిపించింది. 2019 టీ20 ప్రపంచకప్ అర్హత పోటీల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెటర్లు మహ్మద్ నవీద్, షైమన్ అన్వర్ బట్‌లపై ఐసీసీ ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ ఇద్దరిపై ఏకంగా ఎనిమిదేళ్లు నిషేధం విధించింది. 2019 అక్టోబర్ 16 నుంచి ఈ శిక్ష అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రాథమికంగా తప్పు చేసినట్టు తేలడంతో.. ఐసీసీ రెండేళ్ల క్రితమే వారిపై తాత్కాలిక నిషేధం అమలు చేసింది.
ఆర్టికల్ 2.1.1, ఆర్టికల్ 2.4.4 ప్రకారం మహ్మద్ నవీద్, షైమన్ అన్వర్ బట్‌లను ఐసీసీ దోషులుగా పరిగణించి చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఎవరైనా కలిసినా, ఫిక్సింగ్ చేయమని ప్రేరేపించినా, మ్యాచ్ వివరాలు అడిగినా ఐసీసీ అధికారులకు తెలియజేయాలి. ఈ ఇద్దరు ఆ వివరాలను వెల్లడించలేదు. అందుకే ఐసీసీ వారిపై నిషేధం విధించింది.
కుడిచేతి వాటం పేసరైన మహ్మద్ నవీద్ యూఏఈ తరఫున 39 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. వన్డేల్లో 53 వికెట్లు, టీ20ల్లో 37 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన ఓసారి చేశాడు. అంతేకాదు యూఏఈ జట్టుకు సారథ్యం వహించాడు. ఇక 42 ఏళ్ల మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షైమన్ అన్వర్ బట్ 40 వన్డేలు, 32 టీ2లు ఆడాడు. వన్డేల్లో 1219 రన్స్, టీ20ల్లో 971 పరుగులు చేశాడు. వన్డే టీ20 ఒక్కో సెంచరీ చేశారు.