Champions Trophy : కీల‌క మ్యాచ్‌లో దుమ్ములేపిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్‌.. ఇంగ్లండ్ ల‌క్ష్యం ఎంతంటే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఈరోజు 8వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది.

By Medi Samrat  Published on  26 Feb 2025 6:15 PM IST
Champions Trophy : కీల‌క మ్యాచ్‌లో దుమ్ములేపిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్‌.. ఇంగ్లండ్ ల‌క్ష్యం ఎంతంటే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఈరోజు 8వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు తొలి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జ‌ట్ల‌కు 3 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలుపు సెమీ ఫైనల్స్ అర్హ‌తకు కీల‌కం కానుంది.

కాగా ఈ మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్ ఇన్నింగ్స్ 177 పరుగుల భారీ సెంచ‌రీ సాయంతో ఆఫ్ఘనిస్థాన్ ఇంగ్లండ్‌కు 326 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ అఫ్ఘానిస్థాన్‌ను భారీ దెబ్బ తీసి ఆదిలోనే మూడు వికెట్లు తీశాడు. అయితే, షాహిదీతో కలిసి జద్రాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడటంతో ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 325 పరుగులు చేయగలిగింది. షాహిదీతో కలిసి జద్రాన్ నాలుగో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. షాహిదీ అవుటైన తర్వాత కూడా జద్రాన్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించి సెంచరీ సాధించాడు. జద్రాన్ 146 బంతుల్లో 177 ప‌రుగులు చేయ‌గా.. 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. త‌ద్వారా జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఆఫ్ఘనిస్థాన్‌, ఇంగ్లండ్‌లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. జద్రాన్‌తో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్ 41 పరుగులు, షాహిదీ 40 పరుగులు, మహ్మద్ నబీ 24 బంతుల్లో 40 పరుగులు చేశారు. అత‌కుముందు రెహ్మానుల్లా గుర్బాజ్ 6 పరుగులు చేసి ఔట్ కాగా, సెడిఖుల్లా అటల్ 4 పరుగులు చేసి, రహ్మత్ షా 4 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇంగ్లండ్‌ తరఫున ఆర్చర్‌ మూడు వికెట్లు తీయగా, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ రెండు వికెట్లు, జామీ ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌లకు తలో వికెట్‌ లభించింది.

Next Story