జట్టును గెలిపించ‌డ‌మే ల‌క్ష్యం.. పాక్‌తో మ్యాచ్ కోహ్లీకి చాలా ప్ర‌త్యేకం

I want to make my team win at any cost says Virat Kohli. ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘ‌న‌త అందుకోనున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2022 9:31 AM GMT
జట్టును గెలిపించ‌డ‌మే ల‌క్ష్యం.. పాక్‌తో మ్యాచ్ కోహ్లీకి చాలా ప్ర‌త్యేకం

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘ‌న‌త అందుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వందో టీ20 ఆడిన క్రికెటర్‌గా రికార్డులకెక్క‌నున్నాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జ‌రిగే మ్యాచ్‌లో విరాట్ ఈ ఘ‌న‌త అందుకోనున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 99 టీ20ల్లో 3308 ప‌రుగులు సాధించాడు. వందో మ్యాచ్‌లో కోహ్లీ చెల‌రేగి ఈ మ్యాచ్‌ను మ‌రింత ప్ర‌త్యేకంగా మ‌ల‌చుకోవాల‌ని స‌గ‌టు అభిమాని కోరుకుంటున్నాడు.

ఇదిలాఉంటే.. గ‌త కొంత కాలంగా విరాట్ ఫామ్ కోల్పోయి ప‌రుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాడు. అత‌డు శ‌త‌కం సాధించి వెయ్యి రోజుల‌పైనే అవుతోంది. ఇక అర్థ‌శ‌త‌కాల‌కు సైతం క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితి రావ‌డంతో గ‌త కొంత‌కాలంగా కోహ్లీపై విమ‌ర్శ‌లు వెలువెత్తుతున్నాయి. కొంత కాలం విశ్రాంతి తీసుకోవాల‌ని ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు సూచించారు. ఈ క్ర‌మంలో వెస్టిండీస్‌, జింబాబ్వే సిరీస్‌ల‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ నేటి ప్రారంభం కానున్న ఆసియా క‌ప్‌లో బ్యాట్ ఝుళిపించేందుకు సిద్దం అవుతున్నాడు.

ఈ క్ర‌మంలో బీసీసీఐ టీవీతో కోహ్లి ప్రత్యేకంగా ముచ్చటించాడు. "గ‌త ప‌ది సంవ‌త్స‌రాల్లో నెల రోజుల పాటు బ్యాట్ ప‌ట్టుకోకుండా ఉండ‌టం ఇదే తొలిసారి. నిద్రలేవగానే ఈరోజు మనం ఏం చేయబోతున్నాము. రోజు ఎలా ఉండబోతోంది.. అన్న విషయాల గురించి పెద్దగా ఆలోచించను. అయితే.. చేయాల్సిన, చేస్తున్న ప్రతి పనిని వందకు వంద శాతం మనసు పెట్టి చేస్తాను. మైదానంలో ఇలా ఎలా ఉండ‌గ‌లుగుతారు..? ఆ సామ‌ర్థాన్ని ఎలా కొన‌సాగిస్తున్నారు..? అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. వారికి చెప్పే స‌మాధానం ఒక్క‌టే. నాకు ఆట అంటే ప్రేమ‌. ప్ర‌తి బంతితో జ‌ట్టుకు స‌హ‌క‌రించాల్సింది ఇంకా ఎంతో ఉంద‌ని భావిస్తా. మైదానంలోనూ నా పూర్తి శ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తా. ఇదేం అసాధారం కాదు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ జ‌ట్టును గెలిపించేందుకు నా స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతాను" అని కోహ్లీ చెప్పాడు.

Next Story
Share it