రెచ్చిపోయిన రాహుల్ త్రిపాఠి, మార్‌క్ర‌మ్.. స‌న్ రైజ‌ర్స్ హ్యాట్రిక్ విజ‌యం

Hyderabad to 7 wicket win against Kolkata.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)2022 లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2022 3:04 AM GMT
రెచ్చిపోయిన రాహుల్ త్రిపాఠి, మార్‌క్ర‌మ్.. స‌న్ రైజ‌ర్స్ హ్యాట్రిక్ విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)2022 లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అంచ‌నాల‌కు మించి రాణిస్తోంది. గ‌త సీజ‌న్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌కు తోడు ఈసీజ‌న్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కావ‌డంతో మ‌రోసారి ఆఖ‌రి స్థానంతోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తుందేమో అని అనుకుంటున్న త‌రుణంతో వ‌రుస విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో పై పైకి దూసుకువెలుతోంది. టోర్నీలో వ‌రుస‌గా మూడో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. శుక్ర‌వారం రాత్రి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 175 పరుగులు చేసింది. ఆ జ‌ట్టులో నితిశ్‌ రాణా (54 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ) అర్ధసెంచరీ శ‌త‌కం బాద‌గా.. రస్సెల్ (49 నాటౌట్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెన‌ర్లు వెంక‌టేశ్ అయ్య‌ర్‌(6), పించ్‌(7), సునీల్ న‌రేన్‌(6), జాక్స‌న్‌(7) విఫ‌లం కాగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ (28) ఫ‌ర్వాలేద‌నిపించాడు. రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఉమ్రాన్ రెండు, భువ‌నేశ్వ‌ర్‌, జాక్స‌న్ చెరో వికెట్ తీశారు.

అనంత‌రం 176 ప‌రుగుల లక్ష్య‌ ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాట‌ర్లు రాహుల్‌ త్రిపాఠి ( 71 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో), మార్‌క్రమ్‌ (68 నాటౌట్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో )లు దంచి కొట్ట‌డంతో 17.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి విజ‌యాన్ని సాధించింది. చేద‌న‌లో ఓపెన‌ర్లు విలియ‌మ్ స‌న్‌(17), అభిషేక్ వ‌ర్మ‌(3)లు తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరినా.. రాహుల్ త్రిపాఠి, మార్ క్ర‌మ్‌ల జోడి కోల్‌క‌తా బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగింది. చివ‌ర్లో త్రిపాఠి ఔటైనా.. నికోల‌స్ పూర‌న్‌(5)తో క‌లిసి మార్‌క్ర‌మ్ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ర‌సెల్ రెండు, క‌మిన్స్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Next Story
Share it