భారత్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
ఈ ఏడాది చివర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి
By Medi Samrat Published on 14 Oct 2024 11:17 AM ISTఈ ఏడాది చివర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రికెటింగ్ సమరం కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
భారత్‌తో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌కు కామెరాన్ గ్రీన్ దూరం అయ్యాడు. స్టార్ ఆల్ రౌండర్ ఈ వారంలో అతని వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. 25 ఏళ్ల గ్రీన్ సెప్టెంబరులో ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా వన్డే పర్యటన సందర్భంగా వెన్నునొప్పి గురించి ఫిర్యాదు చేశాడు. వెంటనే అతడికి రెస్ట్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇబ్బందులు పునరావృతమవ్వకుండా కామెరాన్ గ్రీన్ కు శస్త్రచికిత్స అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా అభిప్రాయపడింది. అయితే అతను కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేసినట్లు పాలకమండలి తెలిపింది.
ఆల్ రౌండర్‌గా కామెరాన్ గ్రీన్ దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శస్త్రచికిత్సకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ శస్త్ర చికిత్స కారణంగా గ్రీన్ ఫిబ్రవరిలో జరిగే శ్రీలంక టెస్టు పర్యటన, ICC ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ నుండి దూరం అవ్వనున్నాడు. పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్‌లకు మద్దతుగా ఆస్ట్రేలియా ఐదవ బౌలింగ్ ఆప్షన్ గా గ్రీన్ ఉండేవాడు. ఇప్పుడు అతడి స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఎవరిని కొనసాగిస్తుందో చూడాలి. గ్రీన్ 28 టెస్టులు ఆడి 35 వికెట్లు పడగొట్టడమే కాకుండా 1,377 పరుగులు కూడా చేశాడు.