అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించిన హిమాదాస్ ను అసోం ప్రభుత్వం గుర్తించింది. ఆమెపు అసోం రాష్ట్ర డీఎస్పీగా నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సోనోవాల్ నిర్ణయించారు. బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం సోనోవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా వారిని పోలీసు, ఎక్సైజ్, రవాణ శాఖల్లో నియమించేలా సమగ్ర క్రీడా విధానాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి చంద్రమోహన్ పటోవరీ చెప్పారు. అందులో భాగంగానే అసోం డీఎస్పీ ర్యాంక్ అధికారిణిగా హిమాదాస్ ను నియమించారు.
ఇదిలావుంటే.. అసోం లోని నాగయోన్ జిల్లాలోని ఢింగ్ గ్రామానికి చెందిన హిమదాస్ రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రిపేరు రొంజిత్ దాస్ ,తల్లి పేరు జొనాలి దాస్.కుటుంబంలోని నలుగురు పిల్లలలో హిమదాస్ చివరిది. చిన్నతనం నుండీ క్రీడలపై ఇష్టం పెంచుకున్న హిమాదాస్ ప్రపంచ ట్రాక్ ఈవెంట్ ప్రస్థానం వరకూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదిగింది.
డింగ్ ఎక్స్ ప్రెస్ గా పేరొందిన హిమాదాస్.. ఫిన్ లాండ్ లోని టంపెరెలో జులై 7, 2018న జరిగిన ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్-2018 ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన 18 ఏళ్ల హిమదాస్ తొలి స్వర్ణం సాధించిన భారతీయురాలిగా ఘనత సాధించింది. 400మీటర్ల ఫైనల్లో 51.46 నిమిషాల్లో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది. ఇతర క్రీడల్లో విజయాలు సాధించినప్పుడు.. భారీ పారితోషకాలు, నజరణాలు ప్రకటించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. హిమాదాస్ వంటి అథ్లెట్స్‌లు విజయాలు సాధించినప్పుడు వారిని తగురీతిలో గౌరవించకుండా.. అంత చిన్నచూపు ఏంటని నెటిజన్లు పలుమార్లు సోషల్ మీడియాలో తమ గళాన్ని విప్పారు.