హర్షా భోగ్లేపై దాడి..? లైవ్‌లో మాట్లాడుతుండ‌గానే..?

Harsha Bhogle issues clarification over his viral Instagram live.ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే పై దాడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2022 3:36 PM IST
హర్షా భోగ్లేపై దాడి..?  లైవ్‌లో మాట్లాడుతుండ‌గానే..?

ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే పై దాడి జ‌రిగింద‌న్న వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌నకు ఏమైందోన‌ని అభిమానులంతా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. మార్చి 26 నుంచి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) ప్రారంభం కానున్న నేప‌థ్యంలో క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్ నిర్వ‌హించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో హ‌ర్షా భోగ్లే పాల్గొన్నారు. లైవ్ కొన‌సాగుతుండ‌గా.. హర్షా అకస్మాత్తుగా స్క్రీన్‌పై కనిపించకుండా పోయాడు.

అంతేకాకుండా అత‌డిపై ఎవ‌రో దాడి చేస్తున్న‌ట్లుగా అరుపులు, కేక‌లు వినిపించాయి. దీంతో అంద‌రూ ఏదో జ‌రిగింద‌ని ఒక్క‌సారిగా షాక్‌కు గురైయ్యారు. ఛానెల్ ప్ర‌తినిధి సైతం హ‌ర్షాపై ఎవ‌రో దాడి చేసి ఉంటార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో గురువారం(మార్చి 24)న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

హ‌ర్షాకు ఏమైంది..? ఎవ‌రు దాడి చేశారు..? ఎందుకు చేశారు..? అని నెటీజ‌న్లు ఆరా తీయ‌డం మొద‌లెట్టారు. దీనికి మ‌రింత హైప్ ను జోడించింది క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్‌. హ‌ర్షాకు ఏమైందో త‌మ‌కు తెలియ‌ని, అక్క‌డ అస‌లు ఏం జ‌రిగిఉంటుందో తెలియ‌ని, తెలుసుకునేందుకు హ‌ర్షా టీమ్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ట్వీట్ చేసింది. దీంతో అభిమానుల్లో ఆందోళ‌న రెట్టింపైంది.

చివ‌ర‌కు ఇదంతా నిజం కాద‌ని.. ఆ ప్రోగ్రామ్ నిర్వాహ‌కులు ప్లే చేసిన చీప్ ట్రిక్ అని తెలిసింది. కాగా.. దీనిపై హ‌ర్షా భోగ్లే స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నాన‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. నిజానికి త‌న‌పై ఎలాంటి దాడి జ‌ర‌గ‌లేద‌ని, వీడియోలో తాము అనుకున్న‌ది ఒక‌టైతే.. జ‌రిగింది ఇంకొక‌ట‌ని చెప్పాడు. ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎవ్వ‌రికి ఇబ్బంది పెట్టాల‌ని ఇలా చేయ‌లేద‌ని, ఏదీ ఏమైన‌ప్ప‌టికీ అంద‌రి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు హ‌ర్షా ట్వీట్ చేశాడు.

Next Story