ఆఖరి ఓవర్ ఉమ్రాన్‌కు ఇవ్వడానికి కారణం అదే : హార్దిక్
Hardik reveals reason behind handing Umran Malik the last over in 2nd T20I.డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో
By తోట వంశీ కుమార్
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 225/7 భారీ స్కోరు సాధించింది. అయితే.. ఐర్లాండ్ దాదాపుగా ఆ లక్ష్యాన్ని చేదించినంత పని చేసింది. చివరికి 221/5 స్కోరుకు పరిమితమైంది.
ఆఖరి ఓవర్‌లో ఐర్లాండ్ గెలవడానికి 17 పరుగులు అవసరమైన దశలో యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటికి ఉమ్రాన్ 3 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒకే వికెట్ పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు రెండు ఓవర్లు మిగిలి ఉండగా.. హార్థిక్ కూడా ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం రెండో మ్యాచ్ ఆడుతున్న ఉమ్రాన్ ను నమ్మి హార్థిక్ బౌలింగ్ ఇచ్చాడు.
మ్యాచ్ అనంతరం దీనిపై హార్థిక్ స్పందించాడు. ఆరు బంతుల్లో 17 పరుగులు కావాలి. ఎలాంటి ఒత్తిడి పడకూడదని భావించా. ఉమ్రాన్ బౌలింగ్‌లో మంచి పేస్ ఉంది. అతని పేస్‌లో 17పరుగులు రాబట్టడం చాలా వరకు కష్టమే. బంతి మిస్సయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బౌండరీలు వెళ్లినప్పటికీ.. సిక్సర్లు రావని ఫీలయ్యా. అందుకే అతన్ని బౌలింగ్ చేయించానని హార్దిక్ అన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లు చాలా మంచి షాట్‌లు ఆడారు. అయితే.. కీలక సమయంలో ఐర్లాండ్‌ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు. దీపక్ హుడా, సంజూ శాంసన్ అద్భుతంగా ఆడారని కితాబు ఇచ్చాడు. అభిమానుల మద్దతు చాలా బాగుందని, దినేశ్ కార్తిక్, సంజూ శాంసన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు అభిమానులు అరుపులతో వాళ్లని ఉత్సాహపరిచారని అన్నాడు. ఇక తొలి సిరీస్‌ను కైవసం చేసుకోవడం కెప్టెన్‌గా ఎప్పుడూ ప్రత్యేకమే అని హార్థిక్ చెప్పుకొచ్చాడు.