అన్న చేతిలో ఔటవ్వడంపై హార్థిక్ పాండ్య ఏమన్నాడంటే..?
Hardik Pandya says getting out to brother Krunal Pandya ‘hurt more.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సోమవారం
By తోట వంశీ కుమార్ Published on 29 March 2022 8:58 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీపక్ హుడా (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుష్ బదోనీ (41 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ఐదు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేదించింది. రాహుల్ తెవాటియా (24 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అభినవ్ మనోహర్ (7 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 33; 5 ఫోర్లు, ఒక సిక్సర్), వేడ్ (30), మిల్లర్ (30) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను గెలిపించారు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడాడు. జట్టు విజయంలో అందరి పాత్ర ఉందని, ఇది ఏ ఒక్కరి విజయం కాదన్నాడు. ముఖ్యంగా మహ్మద్ షమీ, రాహుల్ తెవాటియా విజయంలో కీలకపాత్ర పోషించారని కొనియాడాడు. ఇక తనను తన సోదరుడు కృనాల్ ఔట్ చేయడంపై స్పందించాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో తాము ఓడిపోయి ఉంటే.. కృనాల్ బౌలింగ్‌లో ఔటైనందుకు మరింత బాధ పడేవాడినన్నాడు. అయితే.. విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు.
ఇక మనోహర్ రూపంలో తమకు మంచి ఆటగాడు దొరికాడని.. అతను టీమ్‌కు భవిష్యత్ ఆశాకిరణం అని చెప్పుకొచ్చాడు. ఇక షమీ గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అతడి సీమ్ బౌలింగ్ గురించి అందరికీ తెలిసిందేనన్నాడు. తాను నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నట్లు తెలిపాడు. తనకున్న అనుభవంతో తాను ఒత్తిడి తీసుకుని మిగతా బ్యాట్స్‌మెన్లు స్వేచ్ఛగా ఆడేలా చూస్తానని హార్దిక్ పాండ్యా చెప్పాడు.