ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత వ‌న్డేల‌కు హార్థిక్ గుడ్‌బై

Hardik Pandya might retire from ODIs after 2023 World Cup says Ravi Shastri.ఇటీవలే ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ బెన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2022 2:56 PM IST
ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత వ‌న్డేల‌కు హార్థిక్ గుడ్‌బై

ఇటీవలే ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ బెన్ స్టోక్స్ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో ఆడటం తనకు చాలా కష్టంగా ఉందని, విప‌రీత‌మైన షెడ్యూల్ వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పాడు.దీంతో ప‌లువురు ఆట‌గాళ్లు కూడా బెన్‌స్టోక్స్ మార్గంలోనే న‌డుస్తార‌ని మాజీలు విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఏడాది భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత పాండ్యా వ‌న్డేల నుంచి త‌ప్పుకునే అవకాశం ఉంద‌న్నాడు.

భవిష్యత్తులో ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌ కంటే టీ20 ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని ర‌విశాస్త్రి అభిప్రాయ‌ప‌డ్డాడు. "'వన్డేలు, టీ20లు కంటే టెస్టు క్రికెట్ చాలా ప్రత్యేకమైనది. కానీ టెస్టు క్రికెట్‌ రోజు రోజుకి ఆదరణ కోల్పోతోంది. ఇక ఇప్పటికే ఆటగాళ్లు వారు ఏ ఫార్మాట్‌లలో ఆడాలో నిర్ణయించుకున్నారు. హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే అతడు ఎక్కువగా టీ20 క్రికెట్‌ ఆడాలనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని చాలా సార్లు స్పష్టంగా చెప్పాడు అని ర‌విశాస్త్రి అన్నారు.

భార‌త్ వేదిక‌గా వ‌చ్చే ఏడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. బ‌హుశ‌ ఆ త‌రువాత అత‌డు వ‌న్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్ప‌వ‌చ్చు. జ‌ట్టులో మ‌రికొంత మంది ఆట‌గాళ్లు కూడా ఇలాంటి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందన్నాడు. ప్ర‌స్తుతం ఆట‌గాళ్లు టి20 ప్ర‌పంచ‌క‌ప్‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నార‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెర‌గ‌డ‌మే అందుకు కార‌ణం అని అన్నాడు. వారిని అందులో ఆడ‌కుండా మ‌నం ఆప‌లేం కాబ‌ట్టి ద్వైపాక్షిక సిరీస్‌ల‌ను తగ్గించి ఆట‌గాళ్ల‌పై ఒత్తిడి త‌గ్గించేలా ప్ర‌య‌త్నం చేయాల‌న్నాడు. ప్ర‌స్తుతం ర‌విశాస్త్రి చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాఫిక్‌గా మారాయి. మ‌రీ దీనిపై హార్థిక్ స్పందిస్తాడో లేదో చూడాలి.

Next Story