అవసరమైనప్పుడు రోహిత్ కచ్చితంగా సాయం చేస్తాడు: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్2024 ఎడిషన్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 3:55 PM ISTఅవసరమైనప్పుడు రోహిత్ కచ్చితంగా సాయం చేస్తాడు: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్2024 ఎడిషన్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే... సీజన్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ బాధ్యతలను ఆ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. రోహిత్ శర్మను కాదని పాండ్యాకు ఇవ్వడంతో పలు విమర్శలకు కూడా దారి తీసింది. తాజాగా ముంబై కెప్టెన్ హార్డిక్ పాండ్యా ఇదే విషయంపై స్పందించాడు. తొలిసారి మీడియాతో మాట్లాడుతూ రోహిత్ శర్మ గురించి ప్రస్తావించాడు.
తాను ఎన్నోసార్లు రోహిత్ కెప్టెన్సీలో ఆడానని చెప్పాడు హార్దిక్ పాండ్యా. ఈ సారి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండబోతుందని చెప్పాడు. ఏది ఏమైనా తనకు అవసరమైన సమయంలో రోహిత్ శర్మ కచ్చితంగా తనకు అండగా నిలబడతాడని దీమాగా చెప్పాడు. రోహిత్ శర్మ ఎప్పుడూ జట్టుతోనే ఉంటాడని చెప్పాడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎన్నో విజయాలను అందుకున్నాడని పాండ్యా చెప్పాడు. ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఇక నుంచి తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తన సారథ్యంలో రోహిత్ ఆడుతున్నాడనే అంశం గురించి ఇబ్బంది ఎవరూ పడొద్దని కోరాడు. ఇదొక మంచి అనుభవంగా ఉండిపోతుందని హార్దిక్ పాండ్యా చెప్పాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపిక అయిన తర్వాత తాను ఇప్పటి వరకు రోహిత్ శర్మతో మాట్లాడలేదని చెప్పాడు హార్దిక్. రోహిత్ టీమిండియా షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడనీ.. తరచూ ప్రయాణాలు చేస్తున్నాడని చెప్పాడు. రోహిత్‌ను కలిసి దాదాపు రెండు నెలలు అయిపోందన్నాడు. ఐపీఎల్ మొదలైన వెంటనే రోహిత్‌ను ప్రత్యేకంగా కలిసి మాట్లాడతానని హార్దిక్ అన్నాడు. కాగా.. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ కొనసాగాడు. టీమ్‌ను 2022 సీజన్‌లో టైటిల్ విజేతగా నిలవగా.. 2023 సీజన్‌లో మాత్రం రన్నరప్‌గా నిలిపాడు. మరోవైపు 2024 సీజన్‌లో మార్చి 24న గుజరాత్ టైటాన్స్ టీమ్‌తోనే ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఆడుబోతుంది.