'జింఖానా తొక్కిసలాట'.. హైదరాబాద్ చరిత్రలో ఒక బ్లాక్ డే: వ్యాఖ్యాత వెంకటేష్
Gymkhana stampede'... a black day will remain in the history of Hyderabad: Cricket analyst Venkatesh. ఆదివారం ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు కొనుగోలు
By అంజి Published on 23 Sep 2022 9:01 AM GMTఆదివారం ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసేందుకు వేలాది మంది అభిమానులు గురువారం జింఖానా గ్రౌండ్స్‌కు వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురికి గాయాలు అయ్యాయి. టికెట్ల అమ్మకంలో సరైన జాగ్రత్తలు పాటించలేదని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన భారీ తొక్కిసలాట ఘటనపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, వ్యాఖ్యాత వెంకటేష్ స్పందించారు. సెప్టెంబర్ 22 తేదీ హైదరాబాద్ చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుందన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో రోజుల నుంచి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయని, కానీ ఎప్పుడు మ్యాచ్ టికెట్ల కోసం ఇంత దారుణం జరగలేదన్నారు. టికెట్ల కోసం క్యూ లైన్‌లో నిల్చున్న వారిపై లాఠీ చార్జీ జరగడం, తొక్కిసలాట జరగడం, మహిళలతో సహా చాలా మందికి గాయాలు కావడం దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు.
చాలా టికెట్లు పబ్లిక్ డొమైన్‌లో పెట్టారని, మిగతా టికెట్లు ఏమయ్యాయో తెలియదన్నారు. మ్యాచ్ కోసం కనీసం 35 వేల టికెట్లు అందుబాటులో ఉండాలి. అయితే 35 వేల టికెట్లలో ఐదారు వేల టికెట్ల మాత్రమే జనరల్ పబ్లిక్ కోసం పెట్టారని, మిగతా టికెట్లన్నీ హాంఫట్ అయినట్లుగా చెప్పారని అన్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కూడా ఎన్ని టికెట్లు అమ్మారో చెప్పడానికి నిరాకరించారని అన్నారు. ఎన్ని టికెట్లు పబ్లిక్‌కు ఇచ్చారు, ఎన్ని టికెట్లు పాస్‌ల రూపంలో అమ్మారు, ఎన్ని టికెట్లు కార్పొరేట్ వర్కర్స్‌కు కేటాయించారనేది చెప్పలేదన్నారు. టికెట్లు ఆన్‌లైన్‌లో ఎన్ని అమ్మామనేది, ఆఫ్‌లైన్‌లో ఎన్ని అమ్మామనేది ప్రతీది లెక్క ఉంటుందని, ప్రెస్‌మీట్‌లో అడిగిన ప్రశ్నకు కూడా అజారుద్దీన్ సమాధానం చెప్పలేకపోయారని అన్నారు.
''మ్యాచ్ జరిపేది ఎవరి కోసం.. పబ్లిక్ కోసమే కదా, సగటు ప్రేక్షకుడి వల్లే క్రికెట్‌లో ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. మరీ ఆ ప్రేక్షకుడిని పక్కన పెట్టేసి మీరు మీ మెప్పు కోసం రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు టికెట్లు ఇవ్వడం, మీ క్లబ్‌లకు టికెట్లు ఇవ్వడం ఏంటీ.. ఇది కాదు కదా చేయాల్సింది. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతోంది, దీంతో కామన్ పబ్లిక్ కూడా ఎంతో ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్‌కి ఇదేనా మీరు న్యాయం చేసేది'' అంటూ హెచ్‌సీఏను క్రికెట్ విశ్లేషకుడు వెంకటేష్ ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో 3 కోట్ల జనాభా ఉందని, 30 వేల టికెట్లు కూడా లేవని, ఒక శాతం మాత్రమే టికెట్లు అమ్ముతున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పారని, మరీ ఆ ఒక శాతం టికెట్లను కామన్ పబ్లిక్‌కు కాకుండా, వేరే వాళ్లకు ఇవ్వడం ఏంటన్నారు. ఇది కామన్ పబ్లిక్‌కు చేస్తున్నా అన్యాయమన్నారు. ఇలా చేయడం వల్ల క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతుందని వెంకటేష్ అన్నారు. బీసీసీఐ, రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లు కామన్ ప్రజల ఫ్యాషన్‌ను సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. క్రికెట్ అభిమానులు ఆగ్రహిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. ఇన్ని అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని చాలా మంది అంటున్నారని చెప్పారు.
హెచ్‌సీఏలో చాలా దారుణమైన రాజకీయాలు ఉన్నాయన్నారు. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు అయిన తర్వాత చేసింది ఏం లేదని.. వాళ్లు వాళ్లు కోట్లాడుకోవడం తప్పా అని అన్నారు. అజారుద్దీన్‌కి సెక్రటరీ విజయానంద్‌కు పడదని, ఒకరిపై ఒకరు కోర్టు కేసులు వేసుకుంటారని చెప్పారు. మూడేళ్లలో వాళ్లు చేసింది జీరో అని అన్నారు. రాకా రాకా మ్యాచ్ వచ్చింది.. చూస్తే స్టేడియంలో రూఫ్ ఎగిరిపోయింది, కూర్చీలు సరిగా లేవు, గ్రౌండ్ కూడా ప్రాపర్ కండిషన్‌లో లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత దిగజారి వ్యవహారించడం దారుణమన్నారు. మ్యాన్ పవర్ లేకపోతే.. ఈవెంట్ మేనేజర్లకు అప్పజెప్పాలని, మీరు (హెచ్‌సీఏ) ఆ మాత్రం చేయలేరా? అని ప్రశ్నించారు. మ్యాన్ పవర్ లేకపోవడమనేది పెద్ద జోక్‌గా అభివర్ణించారు.