రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా, మాజీ ఫార్ములా వన్ రేసర్ మైఖేల్ షూమేకర్ తో పాటు మరో 11 మందిపై బుధవారం గురుగావ్‌లో కేసు నమోదైంది. ఢిల్లీలోని చత్తార్‌పూర్ మినీ ఫామ్‌కు చెందిన షపాలీ అగర్వాల్ అనే మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో వారిపై చీటింగ్, క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రియల్‌టెక్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసిందని.. సెక్టార్ 73లో షరపోవా ప్రాజెక్ట్ పేరిట షూమేకర్ టవర్స్ అపార్టుమెంట్‌లో ఓ ప్లాట్ కోసం బుక్ చేశానని.. కంపెనీ ప్రతినిధులు తన వద్ద 80లక్షలు తీసుకున్నారని అగర్వాల్ చెప్పింది. ఈ నిర్మాణం 2016 నాటికే పూర్తి కావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు ప్రారంభించలేదని షపాలి తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ప్రాజెక్టులో షరపోవా, షూమేకర్ భాగస్వాములుగా ఉండడంతో పాటు ప్రచార కర్తలుగా ఉన్నారన్నారు. ఆ సంస్థ ప్రచార చిత్రాల్లోనూ వాగ్దానాలు చేశారన్నారు. మాజీ టెన్నిస్ స్టార్ సైట్‌ను సందర్శించి టెన్నిస్ అకాడమీ, స్పోర్ట్స్ స్టోర్‌ను ప్రారంభిస్తానంటూ హామీ సైతం ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయంలో కంపెనీ ప్రతినిధులు ఎన్నిసార్లు సంప్రదించినా.. తమకు న్యాయం జరగలేదన్నారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.