తృటిలో శ‌త‌కం చేజార్చుకున్న గుప్టిల్‌.. స్కాట్లాండ్ ముందు భారీ ల‌క్ష్యం

Guptill 93 Guides NZ to 172/5.టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ 2021 లో భాగంగా దుబాయ్ వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2021 5:48 PM IST
తృటిలో శ‌త‌కం చేజార్చుకున్న గుప్టిల్‌.. స్కాట్లాండ్ ముందు భారీ ల‌క్ష్యం

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ 2021 లో భాగంగా దుబాయ్ వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు అద‌ర‌గొట్టారు. కివీస్ ఓపెన‌ర్ మార్టిన్ గుప్టిల్( 93; 56 బంతుల్లో 4పోర్లు, 7 సిక్స‌ర్లు) చేల‌రేగి ఆడడంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కివీస్ ఐదు వికెట్ల న‌ష్టానికి 172 ప‌రుగులు చేసింది. దీంతో ప‌సికూన స్కాట్లాండ్ ముందు 173 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. స్కాట్లాండ్ బౌల‌ర్ల‌లో స‌ఫ్యాన్ ష‌రీప్‌, బ్రాడ్లే వీల్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మార్క్ వాట్ ఓ వికెట్ తీశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ కు ఆరంభంలోనే గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఐదో ఓవ‌ర్ తొలి బంతికి ఓపెన‌ర్ డెరిల్ మిచెల్‌(13) ఔట్ కాగా.. కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్ (0) ఐదో బంతికి పెవిలియ‌న్ చేరాడు. దీంతో కివీస్ ఓకే ఓవ‌ర్ లో రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఆదుకుంటాడు అనుకున్న కాన్వే(1) సైతం ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో 52 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ క‌ష్టాల్లో ప‌డింది. ఈదశ‌లో గుప్టిల్‌.. గ్లెన్ ఫిలిప్స్ (33; 37 బంతుల్లో 1 సిక్స్‌)తో క‌లిసి న్యూజిలాండ్‌ను ఆదుకున్నాడు.

తొలుత ఆచితూచి ఆడిన గుప్టిల్ క్ర‌మంగా వేగం పెంచాడు. త‌న‌దైన షాట్ల‌తో అల‌రించారు. సెంచ‌రీకి చేరువైన త‌రుణంలో భారీ షాట్‌కు య‌త్నించిన గుప్టిల్ లాంగాన్‌లో మెక్‌లాయిడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో గుప్టిల్ 7 ప‌రుగుల తేడాతో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. ఆఖ‌ర్లో జేమ్స్ నీష‌మ్‌(10 నాటౌట్‌; 6 బంతుల్లో 1 పోర్‌) రాణించ‌డంతో కివీస్.. స్కాట్లాండ్ ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది.

Next Story