సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన తెవాటియా, రషీద్ ఖాన్
Gujarat Titans beat Sunrisers Hyderabad by 5 wickets.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో సన్ రైజర్స్
By తోట వంశీ కుమార్ Published on 28 April 2022 3:45 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. గుజరాత్ టైటాన్స్ తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 22 పరుగులు అవసరం కాగా.. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రషీద్ ఖాన్ మూడు భారీ సిక్స్‌లతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి టైటాన్స్ ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 195/6 స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (65; 42 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్స్‌లు), మక్రామ్( 56; 40 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఖర్లో శశాంక్‌సింగ్(25 నాటౌట్; 6 బంతుల్లో 4 సిక్సర్లు ) మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ విలియమ్సన్(5), రాహుల్ త్రిపాఠి(16) నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. జోసెఫ్ ఒక వికెట్ తీశాడు.
196 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్ సాహా( 68; 38 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా.. ఆఖర్లో రాహుల్ తెవాటియా(40 నాటౌట్; 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రషీద్‌ఖాన్( 31 నాటౌట్; 11 బంతుల్లో4 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగారు.
గుజరాత్ విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు చేయాల్సి ఉండగా.. హైదరాబాద్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. జాన్సెన్ బౌలింగ్ తొలి బంతికి తెవాటియా సిక్స్ బాదగా.. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతిని రషీద్ సిక్సర్‌గా మలచగా.. నాలుగో బంతికి పరుగులు రాలేదు. దీంతో విజయ సమీకరణం రెండు బంతుల్లో 9 గా మారింది. ఈ స్థితిలో రషీద్ ఖాన్ హైదరాబాద్ ఆశలపై నీళ్లు చల్లాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది గుజరాత్ టైటాన్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు .కశ్మీర్ స్పీడ్‌గన్ ఉమ్రాన్ (5/25) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా లాభం లేకపోయింది. ఉమ్రాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.