ఐసీసీ అధ్యక్షుడిగా మళ్లీ ఆయనే.. రేసులో కూడా లేని గంగూలీ
Greg Barclay re-elected as ICC Chairman.ఐసీసీ అధ్యక్షుడిగా మరోసారి గ్రెగ్ బార్ల్కే ఎన్నికయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 12 Nov 2022 7:55 AM GMTఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అధ్యక్షుడిగా మరోసారి న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్ల్కే ఎన్నికయ్యారు. వరుసగా రెండవ సారి రెండేళ్ల పదవీకాలానికి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకుహ్లానీ ఆఖరి రోజు ఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ను ఉప సంహరించుకోవడంతో బార్ల్కే ఎన్నిక ఏకగ్రీవమైంది.
2020 నవంబర్‌లో గ్రెగ్ బార్ల్కే తొలిసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సంవత్సరం నవంబర్‌తో ఆయన పదవి కాలం ముగియనుండగా ఛైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. తొలుత టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీని ఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దింపాలని బావించిన బీసీసీఐ ఆ తరువాత మనసు మార్చుకుంది. దీంతో గ్రెగ్ బార్ల్కేకు ఎదురులేకుండా పోయింది. బీసీసీఐ సహా 17 మంది ఐసీసీ బోర్డు సభ్యులు గ్రెగ్‌కు మద్దతు ఇవ్వడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రెగ్ గతంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఛైర్మన్‌గా ఉన్నారు. 2015లో ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ డైరెక్టర్‌గాను వ్యవరించారు.
రెండోసారి ఎన్నికైన అనంతరం గ్రెగ్ మాట్లాడుతూ.. "గత రెండు సంవత్సరాల్లో మేము మా గ్లోబల్ గ్రోత్ స్ట్రాటజీని ప్రారంభించడం ద్వారా గణనీయమైన పురోగతిని సాధించాము. ఇది మా క్రీడకు విజయవంతమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి స్పష్టమైన దిశను అందిస్తుంది. క్రికెట్‌లో పాల్గొనడానికి ఇది ఒక ఉత్తేజకరమైన సమయం. మా ప్రధాన మార్కెట్‌లలో ఆటను బలోపేతం చేయడానికి అలాగే దాని పరిధిని పెంచడానికి మా సభ్యులతో కలిసి పని చేయడం కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను. ప్రపంచంలోని మరింత మంది క్రికెట్‌ను ఆస్వాదించగలరని భరోసా ఇస్తున్నాను అని గ్రెగ్ బార్ల్కే అన్నారు.