రిషబ్ పంత్ అభిమానులకు శుభవార్త
Good news to Rishabh Pant fans.టీమ్ఇండియా స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అభిమానులకు శుభవార్త
By తోట వంశీ కుమార్ Published on 31 Jan 2023 4:14 PM ISTటీమ్ఇండియా స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అభిమానులకు శుభవార్త. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా.. పంత్ ఈ వారంలో డిశ్చార్జి కానున్నాడు. పంత్ మోకాలి సర్జరీ సక్సెస్ అయింది. అతడు త్వరగా కోలుకుంటున్నాడని, ఈ వారంలోనే డిశ్చార్జ్ కానున్నాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
అయితే.. పంత్‌కు మరో సర్జరీ అవసరం అని, అది మార్చిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక పంత్ పూర్తిగా కోలుకోవడానికి 8 నుంచి 9 నెలల సమయం పడుతుందని చెప్పారు. పంత్ విషయంలో ఆస్పత్రి వైద్యులతో బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకోవడంపైనే తమ దృష్టి ఉన్నట్లు చెప్పారు.
పంత్ గాయం కారణంగా ఈ ఏడాది కీలక సిరీస్‌లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు ఆ తరువాత జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఆసియా కప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌కు కూడా పంత్ దూరం కానున్నాడు.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన 'టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022'లో పంత్‌కు చోటు దక్కింది. గత సంవత్సరం పంత్ 12 ఇన్నింగ్స్‌ల్లో 90.09 యావరేజ్‌తో 680 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు అర్థశతకాలు ఉన్నాయి.